Site icon Swatantra Tv

రేపే లోక్‌సభ తొలిదశ పోరు

   రేపు లోక్‌సభ తొలిదశ సమరానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 21 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో బరిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, మాజీ గవర్నర్‌ పోటీ పడుతున్నారు. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

   కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ నియోజక వర్గంలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్‌ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2004 నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో బరిలో దిగారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్‌ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్‌ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటు న్నారు. ఉత్తరప్రదేశ్‌లో కులరాజకీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్‌ భలియా పోటీకి నిలబడ్డారు.

     అలాగే జితేంద్ర సింగ్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి తలపడు తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌తో మాజీ కాంగ్రెస్‌ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ తలపడుతున్నారు. తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్‌. మురుగన్‌ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ చెన్నై సౌత్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్‌ త్రిపురలో బిప్లవ్‌ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆశిశ్‌ కుమార్‌ సాహా నిలబడ్డారు.

Exit mobile version