Site icon Swatantra Tv

ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం

తిరుమల లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు చేరింది. ఈ మొత్తం అంశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం జరుగుతోందంటూ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేపనూనే వాడారంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు.

లడ్డూ ప్రసాదం ఘటనకు సంబంధించి వెంటనే కమిటీ వేసి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనిపై స్పందించింది హైకోర్టు. అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తేల్చిచెప్పింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం చేపడతామని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నత న్యాయస్థానం.

మాజీ సీఎం జగన్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖతోపాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌తోపాటు అప్పటి టీటీడీ పాలకవర్గం, కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడిన వ్యవహారం కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్న సంగతి పక్కన పెడితే.. జగన్‌ ప్రభుత్వ పాలనలో ఇలాంటి వ్యవహారం జరిగిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు నెటిజన్లు. ట్వీట్లతోపాటు పోస్ట్‌లు పెడుతున్నారు.

ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించడంతో…ఇక్కడే మరో ప్రశ్న విన్పిస్తోంది. ఏ తప్పూ చేయనప్పుడు న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఈ అంశంలో తమపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని ఆపాలని ఎందుకు కోర్టును కోరాల్సి వచ్చిందంటున్నారు భక్తులు.

Exit mobile version