Site icon Swatantra Tv

జమ్మూ కశ్మీర్ లో మూడు ముక్కలాట

    జమ్మూ కశ్మీర్ లో విచిత్రమైన నేపథ్యంలో 2024 పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగం 370వ అధిక రణం రద్దు ను తిరస్కరిస్తున్న పార్టీలు, సమర్థిస్తున్న పార్టీలు కూడా లోక్ సభ ఎన్నికల్లో  పరస్పరం పోటీ పడడం విశేషం. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, గులాం నబీ అజాద్.. పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ 5 స్థానా లకు పోటీ చేస్తుండగా ఒమర్ అబ్దుల్లా పార్టీ 3, మహబూబా ముఫ్తి పీడిపీ 3 స్థానాల్లోనూ కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.

  జమ్మూ కశ్మీర్ లోని ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 19న ఉధంపూర్, ఏప్రిల్ 26న జమ్మూ, మే 7న అనంతనాగ్ – రజౌరి, మే 13 న శ్రీనగర్,, మే 20న బారాముల్లా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. లద్దాఖ్ లో మే 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ విభజన కు ముందు గత మూడు ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన సీట్లు ఇలా ఉన్నాయి. 2009 లోక సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 3, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకోగా, మరో స్థానాన్ని ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. 2014లో బీజేపీ 3, మహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమో క్రటిక్ పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. 2019లో బీజేపీ 3 స్థానాలు, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వం లోని నేషనల్ కాన్ఫరెన్స్ మూడు స్థానాలను గెలుచుకుంది.

   జమ్మూకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి ముందు కశ్మీర్ లో మూడు, జమ్మూలో రెండు, లద్దాఖ్ లో ఒకటి చొప్పున మొత్తం ఆరు లోక్ సభ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం కశ్మీర్, జమ్మూ డివిజన్లలో చెరో రెండున్నర స్థానాలు ఉండగా, లద్దాఖ్ ఒక లోక్ సభ స్థానంతో ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. లద్ధాఖ్ స్థానికులు ప్రత్యేక హోదా, రాజ్యాంగం ఆరో షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి గిరిజన తెగలకు ప్రత్యేక సౌకర్యాలు డిమాండ్ చేస్తూ. సోనమ్ వాంగ్ చుక్ 21 రోజులు నిరాహారదీక్షచేశారు. లద్ధాఖ్ విశిష్టతను, ప్రకృతి వనరులను పరిరక్షించాలని కూడా కోరుతున్నారు.

   జమ్మూ కశ్మీర్ లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒమర్ అబ్దుల్లా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. కాగా, వయోభారం మీద పడుతుండడంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెంట్రల్ కశ్మీర్ లోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి షియా నాయకుడు ఆగా సయ్యద్ రుహుల్లా మొహదీ, అనంతనాగ్ – రజౌరీ నుంచి మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి పోటీచేస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా కు పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసి డెంట్ సజ్జద్ లోనే తో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్ లో ఇండియా అలయన్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందని ఒమర్ అబ్దుల్లా వెల్లడిం చారు. కాంగ్రెస్ ఉధంపూర్, జమ్మూ స్థానాలనుంచి పోటీ చేస్తోంది.

   పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్- రజౌరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, సీనియర్ గుజ్జర్, సెంట్రల్ కశ్మీర్లోని కంగన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ సహా జమ్ముకశ్మీర్ కు చెందిన ఇతర రాజకీయ దిగ్గజాలతో మెహబూబా తలపడనున్నారు. పీడీపీ యూత్ ప్రెసిడెంట్ వహీద్ పర్రా.. శ్రీనగర్ – బుడ్ గామ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల గోదాలో దిగుతున్నారు. కాగా, మాజీ రాజ్యసభ ఎంపీ ఫయాజ్ అహ్మద్ మీర్. నార్త్ కశ్మీర్ నియోజకవర్గం నుంచి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.కశ్మీరీలు, గుజ్జర్లు, పహారీలు, హిందువులు, సిక్కులు జమ్ముకశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో నిర్భయంగా మాట్లాడగల ప్రతినిధికి ఓటు వేయాలని మెహబూబా విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాను ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ తరుపున అనంతనాగ్ – రజౌరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో నియోజకవర్గంలో ఆ పార్టీ తరుపున ఇంకో అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు. మరో పక్క భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లోనూ పోటీచేసేందుకు సిద్ధమవుతోంది.దిగ్గజాలు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, గులాం నబీ అజాద్ లతో బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నాయి. ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Exit mobile version