Site icon Swatantra Tv

ఎవరికి ఎవరు బీ టీమ్‌ అనే అంశంపై చర్చకు రావాలి.. రాహుల్‌కి కిషన్ రెడ్డి సవాల్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​తో కలిసి పనిచేసింది హస్తం పార్టీయేనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ..కాంగ్రెస్‌లో బీఆర్ఎస్​ను విలీనం చేస్తానన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నదా? లేదా? కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. దర్యాప్తు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎవరు ఎవర్నీ కాపాడుతున్నారో రాహుల్‌గాంధీ చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు.

 

కాంగ్రెస్‌, బీఆర్ఎస్​లు మధ్యవర్తిగా మజ్లిస్‌ పార్టీని పెట్టుకున్నాయి. మజ్లిస్‌ పార్టీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకుండా చేస్తున్నారు. తెలంగాణ రాజకీయ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏలు ఒక్కటే. ఈ మూడు పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నాయి. ఎవరికి ఎవరు బీ టీమ్‌ అనే అంశంపై చర్చకు రావాలని రాహుల్‌ గాంధీకి సవాల్‌ చేస్తున్నాను. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అయినా సరే…దిల్లీ ప్రెస్‌క్లబ్‌ అయినా సరే చర్చకు రావాలి. తేదీ, సమయం, స్థలం మీరు నిర్ణయిస్తే చర్చకు వచ్చేందుకు మేము సిద్ధం. రాహుల్‌ రాజకీయ అవగాహన లేకుండా రాసిచ్చినవి చదువుతున్నారు. అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Exit mobile version