Site icon Swatantra Tv

Gaddar: మూగబోయిన ప్రజా ఉద్యమ గొంతుక.. ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక నింగికేగింది. ప్రజాగాయకుడు గద్దర్‌(76) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అల్వాల్‌లోని ఇంటివద్ద జులై 20న గద్దర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గుండెలో సమస్య ఉండటంతో ఈ నెల 3న వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు.

శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో హుషారుగా పాటలు కూడా పాడిన ఆయన… త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి కూడా మాట్లాడారు. అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించింది. చాన్నాళ్లుగా రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం, వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. ‘‘ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించాం… కోలుకున్నట్లే కన్పించి ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు.
చివరి క్షణాల్లోనూ గద్దర్‌ పాటను వదల్లేదు’’ అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఐసీయూలో చేర్చినప్పుడు కూడా పాటలు పాడారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ను ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఆయన కొంత ఆరోగ్యంగా, చలాకీగా కనిపించారు. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నిన్ననే కలిశానని.. మంచిగనే ఉన్నానని చెప్పారని, ఇంతలోనే సీరియస్‌ అయిందని గద్దర్‌ భార్య విమల భోరున విలపించారు. కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ (74) అంత్యక్రియలు ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయలోనే ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్థీవదేహాన్ని ఆదివారం సాయంత్రం నుంచి.. ఎల్బీ స్టేడియంలో ఉంచారు. తద్వారా బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు.. ఆయన్ని కడసారి చూసేందుకు వస్తున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సోమవారం ఉదయం 11 గంటలవరకూ పార్థీవదేహాన్ని అక్కడే ఉంచి.. ఆ తర్వాత.. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది.  మూడు రోజుల కిందట అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్.. ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్టు ఆయన కొడుకు సూర్యం తెలిపారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Exit mobile version