Site icon Swatantra Tv

పాతబస్తీలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం ఖరారు

     హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5.5 కిలో మీటర్ల మేర మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు

    హైదరాబాద్‌లో ఎల్బీనగర్‌-మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ల మధ్య 69.2 కి.మీ. మేర కొన్నేళ్లుగా మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ దాదాపు రూ.16 వేల కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికీ ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాతబస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచీ నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రోరైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు.

     కొత్త లైను ఎంజీబీఎస్‌ నుంచి దారుషిఫా, పురానీ హవేలీ, ఏత్‌బార్‌ చౌక్‌, అలిజాకోట్ల, మీర్‌మొమిన్‌ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్‌, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఏర్పాటు కానుంది. 5.5 కి.మీ. మేర మార్గంలో 4 స్టేషన్లు సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌ నుమా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2,000 కోట్ల వ్యయమవుతుందని అధికారులు ప్రకటించారు.రైల్వేలైను నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజినీరింగ్‌ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా లైను నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్‌ ఎల్‌అండ్‌టీ మెట్రోకే ఇస్తారా.. టెండర్లను పిలిచి మరో నిర్మాణసంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేలలేదు

Exit mobile version