Site icon Swatantra Tv

వివాదాస్పదమైన సీఏఏ అమలుకు రంగం సిద్ధం

     దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా సీఏఏ దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల వేళ వివాదాస్పద సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా ప్రతిపక్ష పార్టీలు సీఏఏను వ్యతిరేకించడంతోపాటు, ఎన్నికల ముందు అమలు చేయడాన్ని తప్పుపడుతుంటే. పలు వర్గాలు దీనిని స్వాగతిస్తున్నాయి.

    పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తన కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. వివాదాస్పదమైన సీఏఏ తక్షణం అమలులోకి తెచ్చింది. సీఏఏ అమలు తర్వాత, 2014 డిసెంబర్ 31కి ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఐదేళ్లపాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందుతారు. ఆరు కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది. మయన్మార్, బంగ్లాదేశ్ ఇతర దేశాలనుంచి వస్తున్న అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. సిఏఏ కు 2019 డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదించింది. ఆతర్వాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించ టం చేయవచ్చు.

     ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు – హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే  వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోవాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉండడం తప్పనిసరి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారి టీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ లక్ష్యం. అయితే, ఇందులో ముస్లింలను చేర్చలేదు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కాగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తోందని కొందరు ఆరోపించారు.

    తాజాగా.. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకె, ఎంఐఎం సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల పట్ల వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ముస్లింలు మెజారిటీగా ఉండగా, హిందువులు, ఇతర కులాలు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని 2019 డిసెంబర్ లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏను ముస్లింలే లక్ష్యంగా తీసు కొచ్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిం చనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్‌లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. మెజారిటీ పక్షాల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా మోదీ సర్కార్ సీఏఏ అమలుకు సిద్ధమైంది. సీఏఏ ను వ్యతిరేకిస్తున్న విపక్షాలకు చెందిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్ లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈ అంశం పై ఏ మేరకు సామరస్యం సాధ్యమో చూడాలి.

Exit mobile version