Site icon Swatantra Tv

బిగ్​ఫైట్​కి రంగం సిద్ధం.. భారత్​-పాక్ మధ్య భీకర పోరు.. గెలుపెవరిదో?

స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌ జట్లు శనివారం తలపడనున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. 1992 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్‌ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో టీమ్​ఇండియా సారథి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, KL రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొస్తుంది. డెంగీ నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ శుభ్‌మన్‌ తుది జట్టులో లేకపోతే.. ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం దక్కనుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, జడేజా కూడా తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే పాకిస్థాన్‌పై భారీ స్కోర్‌కు ఢోకా ఉండదని భారత్ జట్టు అంచనా వేస్తోంది.

బౌలింగ్‌ విభాగంలోనూ భారత్‌ జట్టు పటిష్ఠంగానే కనిపిస్తోంది. స్టార్‌ బౌలర్ బుమ్రా మంచి ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లలో మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువగా పరుగులు ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో మహ్మద్‌ షమీని.. తుది జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని భావిస్తే శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై వరుస పరాజయాల ఫోబియాతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతోంది. బౌలింగ్‌ విభాగంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ జట్టు ఎక్కువగా సారథి బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో ఘోర పరాజయం తర్వాత మరోసారి భారత్‌ను ఎదుర్కోనుండగా సమష్ఠిగా రాణించి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో దాయాదుల సమరం జరుగుతుండగా మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను సుమారు లక్ష మంది ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంది.
Exit mobile version