రాష్ట్ర కాంగ్రెస్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది గాంధీ భవన్. హస్తం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో వాస్తు అక్కడి నేతలకు కలిసి వచ్చిందా..? ఆ చోటులో కూర్చున్న నేతలు ఢిల్లీ స్థాయికి ఎదిగారా..? గాంధీ భవన్ లో ఆ గదులకు ఆదరణ పెరగడానికి కారణం ఏమిటి..? ఈ నేతలకు కలిసి వచ్చిన వాస్తు ఏమిటి..? దానికి ఉన్న లెక్కలు ఏమిటి..? ఈ కధా కమామిషు ఏమిటి..?
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇది పాత మాట. మరి కొత్త మాట ఏమిటి..? గాంధీ భవన్ లో నేతలు తమకున్న పరిచయాలు, పైరవిలతో పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నా రు. ఇది సరికొత్త మాట. కొందరు నేతలకు కలసి వచ్చిన సెంటిమెంట్ తమకు సైతం కలసి వస్తుందా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, గాంధీ భవన్ లో ఆ సీట్లలో ఆసీనులైన నేతలంతా రాష్ట్ర స్థాయి పొజిషన్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు గాంధీ భవన్ లో ఆ వాస్తు లెక్కల మీద గట్టి చర్చే జరుగుతోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల లీడర్ల వరకు ఇదే సెంటిమెంట్ కలసి వచ్చిందా..? అంటే ఒక రకంగా అవుననే సమాధానం వస్తోంది. కొత్తగా పదవులు ఆశించే నేతలు సైతం వాస్తు శాస్త్రంలో తమ అదృష్టం పరీక్షించుకోవాలి చూస్తున్నట్టు తెలుస్తోంది. గాంధీ భవన్ లో జరిగే ఏ కార్యక్రమానికైనా, నాడు పీసీసీ హోదాలో, నేడు సీఎం హోదా లో రేవంత్ హాజరు కావాలన్నా, ఆయన గాంధీభవన్ లెఫ్ట్ సైడ్ గేట్ ద్వారా మాత్రమే లోనికి అడుగు పెడుతున్నారు. ఈ సెంటిమెంట్ ను మొదటి నుంచి రేవంత్ పాటిస్తున్నారు. గాంధీ భవన్ లో ఎక్కువగా ఉపయోగించే ప్రధాన ద్వారం PRO ఆఫీస్ దగ్గర ఉన్న ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎడమ చేతి వైపు PRO రూమ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూం వరకు అదే రోల్ లో తొలి అంతస్తులో ఉన్న గదుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఏ నేతకైనా పదవులు దక్కేస్తున్నాయి. దీంతో, ఈ సెంటిమెంట్ పై నేతలు దృష్టి సారిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకున్న కొన్ని రోజులకే TPCC సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి పదవి వరించింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ దక్కించుకొని ఆయన విజయం సాధించారు. రూంలు, కార్యాలయాల సెంటిమెంట్ తో ఆయన ఈ విజయాలు సాధించనట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే, అదే గదిలో ఉన్న మరో నేత హార్కర వేణుగోపాల్ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుడి పదవిని సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న మూడో గదిలో మొన్నటి వరకు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి TPCC మీడియా కమిటీ చైర్మన్ గా సేవలు అందించారు. ఆయనకు భువనగిరి పార్లమెంట్ టిక్కెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాకుండా ఎంపిగా గెలుపు దక్కింది. ఇక ఆ పక్క గదిలో రమేష్ ముదిరాజ్ తో పాటు పలువురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అయితే, ఆ పక్కన ఉన్న అయిదో గది లో కాంగ్రెస్ శ్రేణులకు ఇన్స్యూరెన్స్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కే ఇది వన్నె తెచ్చిందనే విశ్వాసం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక ఆ లైన్ లో మిగిలిన మరో గది TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో పీసీసీ చీఫ్ తర్వాత పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇదేకాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగక.. పీసీసీ చీఫ్ రేసు లో సైతం ప్రధానంగా ఉన్నారు.
విజువల్స్ మహేష్ కుమార్ గౌడ్.
ఇక మొదటి అంతస్తులో సైతం లెఫ్ట్ సైడ్ సెంటిమెంట్ కొనసాగిందనే చెప్పుకోవాలి. TPCC ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కు స్టేట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా పదవి దక్కగా, బీసీ సెల్ చైర్మన్ గా ఉన్న నూతి శ్రీకాంత్ గౌడ్ కి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఎస్సీ సెల్ చైర్మన్ గా ఉన్న నగరిగిరి ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి దక్కించుకోగా, బెల్లయ్య నాయక్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఉన్నత పదవి పొందారు. దివ్యాంగ కార్పొరేషన్ ఉన్నత పదవి విరయ్యకుదక్కింది. ఈ పదవులు దక్కించుకున్న నేతలు అంతా లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలు అందించిన వారే.
లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలందించిన నేతలు ఉన్నత స్థానాలకు చేరడంతో, ఆ గదులు తమకు కేటాయించాలని పార్టీ కి చెందిన కొందరు నేతలు కర్చీఫ్ లో వేసేసి ఆ రూమ్ లు దక్కించుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. పదవుల కోసం పోటీపడడం చూశాం కాని రూముల గురించి పైరవీలు చేసే పరిస్థితి ఏమిటని, ఇదేం చోద్యమని కొందరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా, అవేవి పట్టించుకోకుండా సెంటిమెంట్ రూముల గురించి నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం నుంచి TPCC నేతల వరకు కలసి వచ్చిన విశ్వాసం తమకు సైతం ఉడతా భక్తి మాదిరి సాయం కాకపోతుందా అనే భావనలో ఈ నేతలు ఉన్నట్టు తెలిసింది.