Site icon Swatantra Tv

ప్రభుత్వాలు మారినా …మారని గురుకులాల దుస్థితి

గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలను బలిగొంటుంది. బంగారు భవిష్యత్తు కోసం గురుకులాలకు వస్తే.. తిరిగిరాని లోకాలకు వెళ్లే పరిస్థతి నెలకొంది. ప్రభుత్వా లు మారినా ఫుడ్ పాయిజన్‌ ఘటనలు ఆగవా..? స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా విద్యార్థులకు ఈ గోస తప్పదా..? ప్రభుత్వాలు మారినా..పరిస్థితులు మారవా..?

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా గురుకులాల పరిస్థితులు మారడం లేదు. ఫుడ్ పాయిజన్‌ ఘటనలు ఆగడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌లపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. వారికి మద్దతుగా ఆనాటి కేసీఆర్‌ సర్కార్‌పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ, నాణ్యత లేని ఆహారం, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఫుడ్‌ పాయిజన్‌ అవుతోందని తేలింది. అయితే ఇవే ఘటనలు పునరావృతమవుతున్నాయి.

తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్‌ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తోంది. తమ బిడ్డల గురించి ఏ క్షణాన ఏ మాట వినాల్సివస్తుందోనన్న కలవరం వెంటాడుతోంది. మహబూబాబాద్‌, భువనగిరిలో ఫుడ్‌ పాయిజన్‌తో ప్రశాంత్‌ మృతి చెందిన ఘటన మరువకముందే.. నిర్మల్‌ కేజీవీబీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో హాస్టల్‌లో ఉన్న తమ బిడ్డల ఆరోగ్యం పై తల్లడిల్లుతున్నారు తల్లిదండ్రులు. మరోపక్క స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఇలాంటి ఘటనలు జరగడమేంటన్న విమర్శ వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికీ రేవంత్‌ ఫుడ్‌ పాయిజన్‌ గురించి మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తు న్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఈ నాలుగు నెలల్లో ఏనాడైనా గురుకులాల గురించి పట్టించుకున్నారా అని నిలదీ  స్తున్నాయి..? విద్యార్థులకు అందుతున్న భోజన సదుపాయాలపై ఎందుకు సమీక్ష సమావేశాలు నిర్వహించలేదని నిలదీస్తున్నాయి. మరోపక్క భువనగిరి ఫుడ్‌ పాయిజన్‌ ఘటనను సీరియస్‌గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాల మేరకు NCSC బృందం రంగంలోకి దిగింది. దర్యాప్తు అనంతరం ఫుడ్ పాయిజన్ పై కేంద్రానికి నివేదిక సమర్పిం చనుంది.

 ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్‌ కలిపి 3214 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. అందులో దాదాపు 8 లక్షల 50 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్య కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యధోరణితో విద్యార్థులను ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. ఇకపోతే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా రేవంత్‌ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. సంక్షేమ హాస్టళ్ల మెస్ ఛార్జీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చి… అధికారుల పర్యవేక్షణ జరిగినప్పుడే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగుతాయంటున్నారు SFI రాష్ట్ర కార్యదర్శి నాగరాజు.గతంలో ఫుడ్ పాయిజన్‌ ఘటనల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్‌ నేతలు.. అధికారంలోకి రాగానే విద్యార్థులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇకనైనా విద్యాశాఖ మంత్రిగా, సీఎంగా రేవంత్‌రెడ్డి గురుకులాలపై ఫోకస్‌ పెట్టాలని.. ఫుడ్ పాయిజన్‌ ఘటనలకు అడ్డుకట్టు వేయాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు.

Exit mobile version