Site icon Swatantra Tv

కొనసాగుతున్న తొలి విడత లోక్‌సభ ఎన్నికల సమరం

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు ఓటేసేందుకు బారులుదీరారు. మొదటి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతు న్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది.

సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయమే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటువేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళిసైసౌందర్‌రాజన్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, తిరువన్మియూర్‌లో ప్రముఖ నటుడు అజిత్‌, తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కేఎన్‌ నెహ్రూ, ఉతుపట్టిలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి కే అన్నమళై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మేఘాలయాలోని వెస్ట్‌ గారో హిల్స్‌లో సీఎం కార్నాడ్‌ సంగ్మా, ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో బీజేపీ నేత జితిన్‌ ప్రసాద, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఓటు హక్కు వినియో గించు కున్నారు. కమల్‌ నాథ్‌ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌ ఓటువే శారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS చీఫ్‌ మోహన్‌ భగ్‌వత్‌ ఓటు హక్కువినియోగిం చుకున్నారు. ఓటు మనందరి విధి అని, హక్కు అని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమరం అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. అరుణాచల్‌లో 60కి 10 అసెంబ్లీ స్థానాలను భాజపా ఏకగ్రీవంగా గెలుచుకోవడం తో మిగిలినవాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదు, రాజస్థాన్‌లో 12, మేఘాలయ రెండు, మణిపూర్‌ రెండు, పశ్చిమ బెంగాల్‌లో మూడు మధ్యప్రదేశ్‌లో ఆరు, త్రిపుర ఒకటి, అరుణాచల్‌ ప్రదేశ్‌ రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌ ఎనిమిది, మిజోరం ఒకటి, సిక్కిం ఒకటి, తమిళనాడు 39, అండమాన్‌ నికోబార్‌ ఒకటి, అస్సాం ఐదు, నాగాలాండ్‌ ఒకటి, బిహార్‌ నాలుగు, మహారాష్ట్ర ఐదు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యంగల బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తులు తీసుకున్నారు.

Exit mobile version