Site icon Swatantra Tv

ఎవరి దారి వారిదిగా మారిన వామపక్షాల తీరు

గతమెంతో ఘనం. వర్తమానం అయోమయం. భవిత ప్రశ్నార్థకం. ప్రస్తుతం చెల్లాచెదురు పయనం..ఇలా ఉంది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి. వామపక్షాలు కలిసి పోటీచేసే విషయంలో సయోధ్య కుదరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపిఎం ఒంటరిగా పోటీకి దిగి ఘోర ఓటమి చవిచూసింది. గతంలో సీపీఐ, కాంగ్రెస్ జత కట్టినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో అగమ్య పరిస్థితుల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.

రాజకీయ పార్టీల పొత్తులు, ఎత్తుల్లోను స్పెక్యులేషన్ కనిపిస్తోంది. ఎలా చేస్తే మెరిట్టో, ఎలా చేయకపోతే డీ మెరిట్టో ఎవరికీ అర్థం కావడం లేదు. వామపక్షాల విషయానికి వస్తే…సీపీఐ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టింది. దీంతో, సీపీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిం చిందని, తెలివిగా పొత్తు పెట్టుకుందని.. ఆ పార్టీకి ప్రశంసలు వచ్చాయి. సీపీఎం పంతానికి పోయి చారి త్రక తప్పిదం చేసిందని విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాలు కలిసి పోటీ చేసే విషయంలో సయో ధ్య కుదరలేదు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో వామపక్ష కూటములు చెరోదారిలో వెళ్లబోతున్నట్టు స్పష్టం అవు తోంది.

లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాలు విడి విడి పక్షాలుగా పోటీచేసేందుకే రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఏ ఎన్నికలు వచ్చినా వామపక్షాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ఆ మేరకు ప్రకటించడం, అలా జరిపిన చర్చలు కొన్ని రాజకీయ సమీకరణల వల్ల చెదిరిపోవడం… ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సర్వసాధారణంగా మారింది. చిట్ట చివరకు ఐక్యత వికటించి వేర్వేరుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల్లో స్వతంత్రంగా గెలుపొందిన చరిత్ర వామపక్షాలకు ఉంది. అయితే, ఒంటరిగా పోటీ చేసేందుకు సైతం వామపక్షాలు ముందుకు రాలేకపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కలిసి పని చేసినట్టే, ఈ ఎన్నికల్లో సైతం హస్తం పార్టీతో పొత్తు కొనసాగించాలనే భావిం చింది. ఈ ఉద్దేశంతో బలమైన ఐదు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిపాదన పెట్టింది. ఆ ఐదింటిలో ఒక స్థానాన్ని కోరుతోంది. పొత్తు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా మున్షితో పలు మార్లు చర్చలు జరిపారు. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ ప్రతిపాదించింది. అయితే, కాంగ్రెస్ ఒక్క స్దానం ఇచ్చేం దుకు సిద్ధంగా లేకపోవటంతో జాతీయ కమిటీ చెప్పినట్టు నడుచుకుంటామని సిపిఐ నేతలు ప్రకటించారు.

నల్లగొండ, పెద్దపల్లి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాల్లో కనీసం ఒక సీటైనా తమకు కేటాయించాలని సిపీఐ కాంగ్రెస్ పార్టీని బలంగా కోరుతోంది. ఖమ్మం స్థానాన్ని కేటాయిస్తే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను బరిలోకి దించాలనే ఆలోచన చేసింది. 2014 ఎన్నికల్లో మహా కూటమి తరుపున ఖమ్మం నుంచి నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కనీసం ఒక సీటునైనా ఈ ఎన్నికల్లో కేటాయించాలని సీపీఐ కేంద్ర కమిటి ఏఐసిసి నేతలతో సైతం చర్చలు జరిపింది. అయితే సీట్ల కేటాయింపునకు ఏఐసిసి స్థాయిలో సుముఖంగా లేన్నట్లు తెలిసింది.

ఇండియా కూటమిలో ఉన్న సీపీఐకి దేశంలో ఏ రాష్ట్రంలో సీటు కేటాయింపు చేయకపోవడంతో… ఒంటరిగా బరిలోకి దిగాలని సీపీఐ ఆలోచనలు సాగిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థిని నెమరు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, త్వరలో సీపీఐ కేంద్ర కమిటీ సమావే శంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కుదరని పక్షంలో ఖమ్మం, నల్లగొండలో పోటీ చేసే విషయాన్ని రాష్ట్ర నేతలు పరిశీలిస్తున్నారు. కేంద్ర కమిటీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విషయంపై ముందుకు వెళ్లనున్నారు.

ఇక సీపీఎం పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగి, రాష్ట్రంలో 19 స్థానాలకు పోటీ చేసింది. అయితే, డిపాజిట్ సైతం దక్కించుకోలేక ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం పాలేరులో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయన సొంత గ్రామంలోనూ పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో, ఆయన విమర్శలు సైతం ఎదుర్కొన్నారు.

   వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపి స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. భువనగరి జిల్లా సీపీఎం కార్యదర్శి జహంగీర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఈ స్థానంలో తమకు మద్దతు ఇవ్వా లని సీపీఐ రాష్ట్ర కమిటీకి సీపిఎం లేఖ సైతం రాసింది. ఒకప్పుడు ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల నుంచి సీపీఐ, సీపీఎంలు పలు మార్లు గెలుపొందిన ఘన చరిత్ర ఉన్నా, స్వయంకృత అపరాధాలో, చారిత్రక తప్పిదాలో, కాలానుగుణ మార్పుల వల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రాభవం కోల్పూతూ వచ్చాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో అటు పొత్తుల ఎత్తులు కుదరక, ఒంటరిగా పోటీ చేయడానికి ధైర్యం చాలక సీపీఐ, సీపీఎం డోలయమాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. 1996లో ఖమ్మం నుంచి సిపిఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం, 2004లో భద్రాచలం నుంచి ఎం బాబురావు ఎంపీలుగా గెలుపొంది ఆ పార్టీని గౌరవప్రదమైన పొజిషన్ లో ఉంచారు. భద్రాచలం నుంచి 1984, 1996,1998 మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థిగా సోడే రామయ్య నిలిచి గెలిచారు. ఆ సమయంలో సీపిఐకి జిల్లాలో సముచిత స్థానం ఉండేది. ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతాల్లోనే ఇప్పుడు పోటీకి సైతం వెనుకాడే పరిస్థితి వామపక్షాలు వచ్చిందంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతంలా మారింది.

Exit mobile version