Site icon Swatantra Tv

బీహార్ ఎన్నికల బరిలో చివరి పోరు

   బీహార్‌లో జూన్ ఒకటో తేదీన చివరి పోరు జరగనుంది. ఏడో విడతలో భాగంగా బీహార్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి బరిలో ఉన్న క్యాండిడేట్ల జాబితాలో లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డ మీసా భారతి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్షుల్ అవిజీత్ ఉన్నారు. తూటాల్లాంటి మాటలతో చివరి విడత పోరుకు ప్రచారం హోరెత్తి స్తున్నారు నాయకులు.

  బీహార్‌లో చివరిదైన కీలకపోరుకు రంగం సిద్ధమైంది. ఏడో విడతలో భాగంగా బీహార్‌లోని ఎనిమిది నియోజక వర్గాలకు జూన్ ఒకటో తేదీన పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎనిమిది నియోజకవర్గాలకు గాను మొత్తం 134 మంది బరిలో ఉన్నారు. బీహార్‌లో ఈసారి ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీ యూ, లోక్‌ జనశక్తి, హిందూస్థాన్ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ మార్చా ఉన్నాయి. కాగా ఇండియా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్, వికాస్ శీల్ ఇన్ఫాన్ పార్టీ, సీపీఐ, సీపీఐం, సీపీఐ ఎం ఎల్ పార్టీలున్నాయి. నలంద మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం. అత్యంత పురాతనమైన నలందా విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. వ్యవసాయమే ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, స్వంత జిల్లా నలంద. 2014 అలాగే 2019 ఎన్నికల్లో నలంద నియోజకవర్గం నుంచి జేడీ యూ విజయం సాధించింది. జేడీ యూ సీనియర్ నేత కౌసలేంద్ర కుమార్ ఈసారి కూడా నలంద నుంచి పోటీలో ఉన్నారు. కాగా ఇండియా కూటమిలోని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ టికెట్‌పై సందీప్ సౌరభ్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో నలంద ప్రాంత అభివృద్దికి నితీశ్ కుమార్ ఎనలేని కృషి చేశారు. ఈ అభివృద్ధి పైనే జేడీ యూ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి.

  రాజధాని పట్నా నగరంలోని ఒక నియోజకవర్గం పట్నా సాహిబ్‌. ఈ నియోజకవర్గంలో కాయస్థ సామాజి కవర్గం ఆధిపత్యం ఎక్కువ. నియోజకవర్గంవ్యాప్తంగా మొత్తం ఐదు లక్షలమంది కాయస్థ వర్గం వారుం టారు. ఆ తరువాత యాదవులు, రాజ్‌పుత్‌లు పెద్ద సంఖ్యలో ఉంటారు. పట్నా సాహిబ్‌ నుంచి 2014 అలాగే 2019 లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై అన్షుల్ అవిజీత్ బరిలో ఉన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడే అన్షుల్ అవిజీత్. కాగా బీజేపీ టికెట్‌పై కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీకి కాయస్థ సామాజికవర్గం మద్దతు ప్రకటించింది.దీంతో బీజేపీ సునాయాసంగా గెలిచింది. అయితే ఈసారి కాయస్థ సామాజికవర్గం ఎవరికి మద్దతు ఇస్తుందోనన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది.

పట్నాలోని మరో నియోజకవర్గం పాటలీపుత్ర. ఈ నియోజకవర్గంలో యాదవుల ఆధిక్యత ఎక్కువ. ఆ తరువాత సంఖ్యా పరంగా భూమిహార్లు, బ్రాహ్మణులు, కుర్మీలు ఉంటారు. 2014,2019 ఎన్నికల్లో పాటలీ పుత్ర నుంచి బీజేపీ నేత రాం కృపాల్ యాదవ్ గెలుపొందారు. ఈసారి కూడా రాం కృపాల్ యాదవే పోటీ చేస్తున్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి పోటీలో ఉన్నారు. మొత్తంమీద రాం కృపాల్ యాదవ్, మీసా భారతి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆరా గంగా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం ఇది. ఆరా మౌలికంగా ఆహారధాన్యాల వ్యాపార కేంద్రం. ఓబీసీలు, ముస్లిం మైనారిటీలు, యాదవులు, క్షత్రియులు ఇక్కడ అభ్యర్థుల తలరాత లను నిర్ణయిస్తారు. 2014,2019 ఎన్నికల్లో ఆరా నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం బీజేపీ టికెట్‌పై ఆర్‌ కే సింగ్ పోటీలో ఉన్నారు.హ్యాట్రిక్ సాధించి, చరిత్ర సృష్టించాలని ఆర్‌ కే సింగ్ భావిస్తు న్నారు. అయితే సీపీఎం ఎం ఎల్ లిబరేషన్ టికెట్‌పై సుధామ ప్రసాద్ బరిలో ఉన్నారు.

బక్సర్ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో అటవీ ప్రాంతం పెద్ద విస్తీర్ణంలో ఉండేది. అయితే కాలక్రమంలో బక్సర్ లో సాగుభూమి పెరిగింది. దీంతో అడవులు తగ్గిపోయాయి. ఇక్కడి అడవుల్లో మామిడి, నువ్వులు, వెదురు బాగా లభిస్తాయి. 2014 అలాగే 2019 ఎన్నికల్లో బక్సర్ నుంచి అశ్వినీ కుమార్ చౌబే విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ టికెట్‌ పై మిథిలేశ్ తివారీ పోటీలో ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ నుంచి సుధాకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. బక్సర్ లో పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ససారాం నియోజక వర్గాన్ని బీహార్ ధాన్యాగారంగా చెబుతారు. ఈ సెగ్మెంట్‌ను ఎస్సీలకు రిజర్వు చేశారు. ససారాం నియోజక వర్గం నుంచి గతంలో జగ్జీవన్ రామ్ , ఆయన కుమార్తె మీరా కుమార్ ఎంపీలుగా విజయం సాధించారు. ఇక్కడ రైతుల సమస్యలే ప్రధాన అజెండా. ససారాం నుంచి ఛేది ప్రసాద్ నాలుగుసార్లు బీజేపీ టికెట్ పై గెలిచారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ లభించలేదు. ఈసారి బీజేపీ నుంచి శివేశ్ కుమార్ పోటీలో ఉన్నారు. దళితులే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్‌ గా ఉన్నారు.

   కారాకాట్ ఇది మరో నియోజకవర్గం. కారాకాట్ వ్యాపార కేంద్రంగా ఎదిగింది. అయితే గిట్టుబాటు ధర కోసం ఇక్కడి రైతులు గతంలో అనేకసార్లు ఉద్యమించారు. అలాగే ఇక్కడి యువతకు ఉన్నత విద్య అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా కారాకాట్‌ నియోజకవర్గంలో బాగా తక్కువ. వీటన్ని టితో పాటు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా ఉంది. 2019 ఎన్నికల్లో జేడీ యూ నేత మహా బలి సింగ్ కారాకాట్ నుంచి గెలిచారు. ఈసారి ఇండియా కూటమి లోని సీపీఐ ఎంఎల్ నుంచి రాజా రాంసింగ్ పోటీలో ఉన్నారు. అలాగే రాష్ట్రీయ లోక్‌మోర్చా నుంచి ఉపేంద్ర కుశ్వాహ బరిలో ఉన్నారు. కాగా భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. జహానాబాద్  ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. శాంతి భద్రతల పరంగా ఇది అత్యంత సున్నితమైన నియోజకవర్గం. వామపక్షాలకు కంచు కోటగా ఒకప్పుడు జహానాబాద్‌కు పేరుంది. ఆ తరువాత ఇక్కడ కాంగ్రెస్, జనతాదళ్ బలపడ్డాయి. 2019లో జహా నాబాద్‌ నుంచి జేడీ యూ గెలిచింది. ఈసారి జేడీ యూ తరఫున చందేశ్వర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్‌ నుంచి సురేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మొత్తంమీద నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వాలకు అగ్నిపరీక్షగా నిలుస్తున్నాయి బీహార్ ఎన్నికలు.

Exit mobile version