Site icon Swatantra Tv

ఎన్నికల వేడి .. మొదలైంది.

ఈసారి వేసవి హాట్.. హాట్ గా ఉండబోతోంది. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రకటనతో ఎన్నికల వేడి .. మొదలైంది. మండు వేసవిలో దాదాపు రెండున్నర నెలల పాటు ప్రచారం కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2014, 2019 తో పోలిస్తే.. నిప్పులు చెరిగే ఎండలో అయినా.. సుదీర్ఘ కాలం ప్రచారం చేసుకోడానికి రాజకీయ పార్టీలకు వెసులు బాటు దక్కడం ఓ విశేషం.

మార్చి నెల లోనే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గాడ్పులు మొదలయ్యాయి. ఈ సారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండవచ్చునని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. మార్చి 16న భారత ఎన్నికల కమిషన్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది.. అంటే.. ఏప్రిల్, మే నెలలు… ఈ వేసవి అంతా ఎన్నికల ప్రచారం మోతే…

2014లో సార్వత్రిక ఎన్నికలు 9 దశల్లో కేవలం 36 రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి. 2019లో లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో దాదాపు 39 రోజుల పాటు సాగాయి. 2024 మాత్రం .. ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘకాలం అదీ.. మండు వేసవిలో తీసుకుంటున్నారు. ఎన్నికల తొలి నోటిఫికేషన్ నాటి నుంచి 44 రోజుల తర్వాత ఎన్నికలు ముగుస్తాయి. ఈ వేసవిలో మారథాన్ పోల్ రన్ 2004 లో ఎన్నికల వ్యవధి కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. 2004లో సార్వత్రిక ఎన్నికలు కేవలం నాలుగు దశల్లో ఏప్రిల్ 20 నుంచి 2004 మే 10 మధ్య కేవలం 21 రోజుల్లో పూర్తయ్యాయి.

1999 సార్వత్రిక ఎన్నికలు శీతాకాలంలో చల్లటి వాతావరణంలో జరిగాయి. 1999 సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో కేవలం 30 రోజుల్లో పూర్తయ్యాయి. ఆ ఎన్నికల తర్వాత.. వేసవి కాలంలో ఎన్నికల నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. 2004 నుంచి ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ మధ్యనే ఒకదేశం.. ఒకే ఎన్నిక నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవంద్ కమిషన్ రాష్ట్రపతికి తన నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించిన పక్షంలో 2029లో లోక్ సభకు, అన్నిరాష్ట్రాల అసెంబ్లీలకు అతి తక్కువ వ్యవధిలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగితే.. రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటన నాటి నుంచి చివరి ఫేజ్ పోలింగ్ ముగిసే వరకూ వరకూ దాదాపు రెండున్నర నెలలు వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం ఖర్చు కూడా పెరిగిపోవచ్చు.

Exit mobile version