డొనాల్డ్ ట్రంప్ మౌలికంగా వ్యాపారవేత్త. సాదాసీదా వ్యాపారవేత్త కాదు. అమెరికా కుబేరుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. అదీ ట్రంప్ మహాశయుడి రేంజ్. అయితే వ్యాపారవేత్తగా సంపాదించిన ఐశ్వర్యం, సాధించిన పేరుతో డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి పడలేదు. అమెరికన్ రాజకీయాల్లోనూ హల్‌చల్ చేయలని డిసైడ్ అయ్యారు. దీంతో ట్రంప్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.
రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ జంపింగ్ జపాన్ కిందే లెక్క. కొంతకాలం రిఫార్మ్ పార్టీలోనూ మరికొంతకాలం డెమొక్రటిక్ పార్టీలోనూ ట్రంప్ కొనసాగారు. చివరకు రిపబ్లికన్ పార్టీలో తేలారు. అంచెలంచెలుగా రిపబ్లికన్ పార్టీలో ఓ పెద్ద లీడర్ గా ఎదిగారు. సాదాసీదా పదవులతో సంతృప్తి పడే రకం కాదు ట్రంప్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే మనస్తత్వం ఆయనది. ఎప్పటికైనా అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది ట్రంప్ మహాశయుడి చిరకాల కోరిక. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారాయన. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ట్రంప్ మహాశయుడికి అవకాశం దక్కలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ది ఉడుం పట్టు. ప్రయత్నాలు చేయగా చేయగా, చివరకు 2016లో డొనాల్డ్ ట్రంప్‌నకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం దక్కింది.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం అమెరికా జనంలోకి దూసుకెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్ గా చేసుకుని ట్రంప్ చేసిన ప్రచారం కూడా ఫలితాలనిచ్చింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన భూమిపుత్రులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడు తుంటే,ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాదిమంది కార్పొరేట్ రంగాల్లో బాసుల్లా మారుతున్నా రంటూ ట్రంప్ చేసిన ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. భూమిపుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొ ట్టింది. దీంతో నేటివ్ అమెరికన్లు డొనాల్ట్ ట్రంప్ కు జై కొట్టారు. ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 45వ అధ్యక్షు డయ్యారు. దుందుడుకు మనస్తత్వానికి మారుపేరుగా నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీకి రెడీ అయ్యారు. అమెరికాకు పూర్వ వైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కాదు. అవకాశం దొరికినప్పుడల్లా జో బైడెన్‌ను ఎద్దేవా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చేస్తున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలోనూ జో బైడెన్‌ను కించపరిచేలా ట్రంప్ కామెంట్లు చేశారు. ప్రధానంగా బైడెన్‌కు వయస్సు మీద పడిందనీ, అందువల్లనే కంటి చూపు దెబ్బతిన్నదని ట్రంప్ అనేకసార్లు వ్యాఖ్యా నించారు.ఆఫ్గన్ పరిణామాలు, ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడిని నిలువరించడంలో వైఫల్యం. ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఉనికిని నామమాత్రం చేశాయన్నది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేసి ఉండేది కాదని ట్రంప్ బహిరంగం గానే వ్యాఖ్యా నించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చేచెప్పే సత్తా తనకు ఉందంటారు డొనాల్డ్ ట్రంప్. ఏమైనా ఉక్రెయిన్‌పై సైనికదాడిని నిలువరించడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైంద న్నది ట్రంప్ మహాశయుడి వ్యాఖ్యల సారాంశం.
అమెరికా రాజకీయాల్లో ఇటీవల రహస్యపత్రాల అంశం దుమారం రేపింది. ఈ అంశమే అమెరికా సమాజంలో జో బైడెన్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. బారక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్య క్షుడిగా జో బైడెన్ పనిచేశారు. అలనాటి సర్కార్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరచినవే హాట్‌టాపిక్‌గా మారిన సీక్రెట్ డాక్యుమెంట్స్ . అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ఐదేళ్ల కాలంనాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్యపత్రాలు అందుబాటు లో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్ కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనినొక నిబంధ నగా చేశారు. రహస్య పత్రాలకు అంతటి ప్రాధాన్యం ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే అంతటి కీలకమైన రహస్య ఫైళ్లు కొన్నినెలల కిందట జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పాత కార్యాల యాల్లో నూ అలాగే ఆయన నివాసంలోనూ గుట్టలుగుట్టలుగా దొరికాయి. దీంతో రహస్యపత్రాల వివాదం రాజు కుంది. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా మారింది.
ఈ ల్యాప్‌టాప్ లోని సమాచారాన్ని విశ్లేషించేకొద్దీ అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఆయన కుమారుడు హంటర్ బైడెన్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడన్న తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇవేమీ నిరాధార ఆరోపణలు కావు. ఈ ఆరోపణలను బలపరిచే అనేక కీలక ఆధారాలు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో దొరికాయి. ప్రతిపక్షమైన రిపబ్లికన్ పార్టీకి ఈ సీక్రెట్ డాక్యమెంట్స్ ఎపిసోడ్ ఒక వరంలా దొరికింది. నవంబరులో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో రహస్య పత్రాల ఎపిసోడ్ కీలకాంశంగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి జో బైడెన్‌కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్‌విల్ ఉంది. నిజాయితీపరు డన్న పేరుంది. అయితే పుత్రరత్నం హంటర్ బైడెన్ పుణ్యమా అంటూ వెలుగుచూసిన రహస్య పత్రాల వ్యవహారంతో ఆయన నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైపెచ్చు రహస్య పత్రాల బాగోతం 2022 లోనే బయటపడ్డా మధ్యంతర ఎన్నికల్లో లబ్ది కోసం ఆ విషయాన్ని జో బైడెన్ తొక్కి పెట్టారన్నది మరో ఆరోపణ. ఇదంతా సగటు అమెరికన్లకు మింగుడుపడలేదు.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం జనంలోకి దూసుకెళ్లింది. ఈసారి కూడా అదే మంత్రాన్ని ఉపయోగించడానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నారు. డొనాల్ట్ ట్రంప్ పై విమర్శలు, ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆయనలో మరో కోణం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి స్నేహహస్తం అందించారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీతో డొనాల్డ్ ట్రంప్‌నకు సత్సంబంధాలున్నాయి.