Site icon Swatantra Tv

మోడీ హయాంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి

     సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం మోగించింది బీజేపీ. 2014, 2019 ఎన్నికల్లో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చిన కమలనాథులు.. 2024 ఎలక్షన్లలోనూ విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా రకరకాల ప్రచార అస్త్రాలు ఉన్నా.. ప్రధాని మోడీ మాత్రం అభివృద్ధి అజెండానే నమ్ముకున్నట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే వరుస ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు.

    పది రోజులు..12 రాష్ట్రాలు..! ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అతి త్వరలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, బెంగాల్‌, బీహార్‌, జమ్మూకాశ్మీర్‌, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈనెల రెండో వారం నుంచి మూడో వారం మధ్యలోనే ఎన్నికల షెడ్యూలు రానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలా చూస్తే ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో.. ప్రభుత్వం తరఫున చేపట్టిన, చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రధాని. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

    ఎక్కడిదాకో ఎందుకు రాష్ట్రాల పర్యటనల్లో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు నిర్వహించిన ఆయన.. సుమారు 7 వేల కోట్ల విలువ చేసే పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి వర్చువల్‌గా అంకితం చేశారు. 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంబారి-పింపల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్ – మౌలాలీ మార్గాలను ప్రారంభిం  చారు. అంతేకాదు.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో పర్యటించిన ప్రధాని మరో రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంఖుస్థాపనలు చేశారు.

   ఈ రెండు పర్యటనల్లో భాగంగా అభివృద్ధి మంత్రం జపించారు ప్రధాని మోడీ. దేశంలోని అనేక రాష్ట్రాలు డెవలప్‌ మెంట్‌లో దూసుకెళ్తున్నాయని చెప్పిన ఆయన.. తెలంగాణ ఏర్పడి పదేళ్లయిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని వెల్లడించారు. గత పదేళ్ల లో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటప డ్డారన్న ప్రధాని.. దేశాభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి  చేస్తుందని చెప్పుకొచ్చారు. అనంతరం.. తమిళనాడులోనూ పర్యటించిన ప్రధాని మోడీ… స్వదేశీ ప్రోటోటైప్‌ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత..ఈనెల ఆరున బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని.. అక్కడా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నీటి అడుగున ప్రయాణించే మెట్రోను జాతికి అంకితం చేశారు. 12 వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. నీటి అడుగున ప్రయాణించే మెట్రో ప్రారంభంతో.. దేశంలోని మౌళిక సదుపా యాలు, రవాణా విషయంలో ఒక చరిత్ర సృష్టించినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

      ఇక, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు ప్రధాని మోడీ. సుమారు ఆరువేల కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు నిర్వహించారు. వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకాశ్మీరే తమ లక్ష్యమంటూ ఈ సందర్బంగా ప్రకటించారు ప్రధాని. అంతేకాదు.. జమ్మూకాశ్మీర్‌ కేంద్రంగా వెడ్‌ ఇన్ ఇండియా అనే కొత్త మిషన్‌ను ప్రారంభించారు. తమ వివాహాలకు జమ్మూకాశ్మీర్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవాలంటూ ప్రజలకు సభా వేదికగా విజ్ఞప్తి చేశారు మోడీ. ఈ సందర్భంగానే జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహిం చడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధాని. మరికొన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. అక్కడా వేల కోట్ల రూపాయల శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.

Exit mobile version