Site icon Swatantra Tv

రెండో దశ పోలింగ్ కు దేశం రెడీ!

    2024 లోక్ సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్ కు దేశం సర్వ సన్నద్ధమైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, కేరళలోని రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయినాడ్ తో సహా 20 నియోజకవర్గాలతో సహా 13 రాష్ట్రాల్లో 89 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 26న రెండోదశలో పోలింగ్ జరుగుతుంది.. ఇప్పటికే ప్రచారం తారస్థాయికి చేరింది.. పోలింగ్ జరిగే రాష్ట్రాలకు భద్రతా దళాల తరలింపు పూర్తయింది. ఇండియా కూటమిలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కేరళలో పరస్పరం పోటీకి దిగడం ఓ విశేషం. ఇప్పటివరకూ ఒక్క సీటు గెలవని కేరళలో తొలిసారిగా బోణీ చేయాలని బీజేపీ ఆరాట పడుతోంది.

చెదురు మదురు ఘటనలు తప్ప మొత్తం మీద తొలిదశ పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో రెండో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేడి.. ఎండవేడిమిని దాటి ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. రాజకీయ నాయకులు అన్నిరాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. వయినాడ్ లో రాహుల్ గాంధీ పై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అన్నీరాజా, బీజేపీ కేరళ చీఫ్ సురేంద్రన్ పోటీచేస్తున్నారు.

రెండో దశలో ఏప్రిల్ 26 వ తేదీన 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అసోంలో 5, బీహార్ లో 5 చత్తీస్ గఢ్ లో3 కర్ణాటకలో14, కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్ లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 13, ఉత్తరప్రదేశ్ లో 8, పశ్చిమ బెంగాల్ లో 3, జమ్మూ కశ్మీర్ , త్రిపుర, లక్షద్వీప్, పాండిచ్చేరి , అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కో నియోజకవర్గాలకు, మణిపూర్ లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ పూర్తయింది. 1,210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2024 లోక్ సభ ఎన్నికలు రెండోదశ ప్రచారం తుదిదశకు చేరింది. రెండో దశలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, కేరళ నుంచే సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజా సతీమణి అన్ని రాజా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సినీ నటుడు సురేశ్ గోపీ వంటి వారు ఉన్నారు. కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలకు మొత్తం 500 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో రెండోవిడత పోలింగ్ జరిగే 14 నియోజక వర్గాల్లోనూ 491 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఒక్క నియోజకవర్గంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మణిపూర్ లో రెండో దశలో ఆరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగాల్సి ఉంది. హింసాకాండ, విధ్వంసం ఇంకా కొనసాగుతున్నాయి. రెండో దశ పోలింగ్ కు ముందే జరిగిన రెండు హింసాత్మక సంఘటనల్లో ఒకరు చనిపోయారు.  తొలిదశలో విధ్వంసం చోటు చేసుకున్న 11 పోలింగ్ కేంద్రాల్లో 22న రీపోలింగ్ నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని 8 పోలింగ్ కేంద్రాలలో కూడా రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24న ఇక్కడ రీపోలింగ్ జరుగుతుంది.

దేశవ్యాప్తంగా ఒకపక్క హీట్ వేవ్, మరో పక్క రెండో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలను విడుదల చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్ పదేళ్లలో సాధించిన విజయాలను ఏకరవు పెడుతున్నారు. పేదలకు బ్యాంక్ అకౌంట్లు, మహిళలకోసం ఇంటింటా మరుగుదొడ్లకల్పనతో పాటు డిజిటల్ ఇండియా , టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలను చెబుతూ.. మరి కొద్ది ఏళ్లలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని చెబుతూ.. మూడో టర్మ్ మోదీ సర్కార్ ను ఎన్నుకోవాలని కోరుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, 25 గ్యారంటీలను వాగ్దానం చేస్తూ.. పేదలు, గిరిజనుల సంక్షేమం, అగ్నివీర్ స్కీమ్ రద్దు అంటూ.. హామీలు ఇస్తోంది. ఏమైనా తొలి విడత కన్నా.. రెండో విడత పోలింగ్ నాటికి ప్రచార వేడి మరింత ముమ్మరమైంది.

Exit mobile version