Site icon Swatantra Tv

దేశం జమిలి ఎన్నికల దిశగా అడుగులు

    దేశం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందా? ఒకే దేశం, ఒకే ఎన్నికలకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాయకత్వంలోని హై లెవెల్ కమిటీ అది సాధ్యమే అంటోంది. జమిలి ఎన్నికల వల్ల దేశంలో ఐక్యతాభావం, ప్రజాస్వామ్యం మరింత పటిష్టం కాగలదని సూచిస్తోంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రా లు, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తే.. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయేమో..

      ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యం లోని హైపవర్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదిక సమర్పించింది. ప్యానెల్ ముఖ్యంగా 8 సిఫార్సులను సమర్పించింది. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించే కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు కమిటీ సభ్యులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు- రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ అజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్ కె సింగ్. లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి. కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరిశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. దాదాపు191 రోజుల పాటు నిపుణులతో, రాజకీయ పార్టీలతో విస్తృత స్థాయి చర్చలు, పరిశోధనల అనంతరం కమిటీ 18,626 పేజీలతో కూడిన నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, పార్లమెంటుకు, ఒకే సారి ఎన్నికల నిర్వహణ లో సాధ్యా సాధ్యాలు, దానివల్ల కలిగే లాభాలు. ఎదురయ్యే సమస్యలు వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించారు. ఇటీవల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, ఆర్ పీఐ, అప్నాదళ్ తదితర పార్టీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై చర్చించింది. ఆయా పార్టీల ప్రతినిధులు తమ సూచనలను లిఖితపూర్వకంగా కమిటీకి అందజేశారు. దేశంలో లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు దాదాపు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమే అని కమిటీ పేర్కొంది. 8 కీలక సిఫార్సులు చేసింది.

     మొదటి దశలో లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు, రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హించవచ్చునని కమిటీ సూచించింది. ఒకవేళ హంగ్ ఏర్పడినా, అవిశ్వాస తీర్మానం కారణంగా అసెంబ్లీ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. మొదటి ఏకకాల ఎన్నికల నిర్వహణకు వీలుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి తరువాతి లోక్ సభ ఎన్నికల వరకు పొడిగించవచ్చు అన్నారు. ఏకకాలంలో దేశవ్యాప్త ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్లానింగ్, అవసరమైన పరికరాలు, మానవవనరులసేకరణ, భద్రతాదళాల సంసిద్ధత వంటి జాగ్రత్తలు చేపట్టాలని కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఓటర్లలో విశ్వసనీయత గణనీయంగా పెరుగుతుంది. పారదర్శకత హెచ్చు తుంది. సౌలభ్యం హెచ్చుతుంది. దేశవ్యాప్తంగా ఐక్యతా భావాలు పెంపొందుతాయని పేర్కొన్నా రు.

    ఏకకాల ఎన్నికల వల్ల అభివృద్ధి ప్రక్రియ వేగవంతమవుతుంది. సామాజిక ఐక్యతకు దోహదపడు తుంది. ప్రజాస్వామ్య పునాదులు బలోపేతమవుతాయని కమిటీ వివరించింది. “ఇండియా – దట్స్ ఈజ్ భారత్” అన్న ఆకాంక్షలను సాకారం చేయడానికీ ఈ ఎన్నికల దోహదపడతాయన్నారు. భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలనావ్యవస్థ నిర్మాణాన్ని మెరుగుపరచేందుకు.. మూడంచెల ప్రభుత్వ వ్యవస్థల ఎన్నికలు దోహద పడతాయని కమిటీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, ప్రధాని నరేంద్ర మోదీ.. మొదటి నుంచీ దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలనే కోరుతున్నారు. ఆ భావనను ప్రతిబింబిస్తూ.. హై లెవెల్ కమిటీ నివేదిక వచ్చేసింది. బహుశా 2029 లో జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనకు కృషి జరగవచ్చు.

Exit mobile version