కృష్ణాజిల్లాలో దివిసీమకు 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో ప్రమాదపు అంచుల్లో కృష్ణానది కరకట్టలు ఉన్నాయి. గత ఐదేళ్లలో కృష్ణానది కరకట్టకు కనీస మరమ్మత్తులు చేయలేదు వైసీపీ ప్రభుత్వం. దీంతో నిద్రాహారాలు మాని ఎన్డీయే కూటమి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో దివిసీమ వాసులు బిక్కుబిక్కుముంటూ గడుపుతున్నారు.
కొద్దిగంటల వ్యవధిలో అవనిగడ్డ నియోజవర్గానికి భారీ వరద వచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలో లంక గ్రామాలను వరద ముంచెత్తింది. పులిగడ్డ రేగుల్లంకను వరద నీరు చుట్టుముట్టింది. కంటి మీద కునుకు లేకుండా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్.
లంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద తాకిడికి రహదారులు కొట్టుకుపోయాయి. రెండో రోజూ మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా లంక గ్రామాల్లోనే కొంతమంది ఉన్నారు. అధికారులు కూటమి నాయకులు సహాయక చర్యలు అందిస్తున్నారు. పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. భయాందోళనలో కృష్ణానది లంక గ్రామస్తులు ఉన్నారు. ఇంకా ఇళ్ల నుంచి కదలని వారిని బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.