నలుగురు పిల్లలను పొట్టనపెట్టుకున్న కలుషిత ఆహార ఘటనపై దర్యాప్తు స్పీడప్ చేసింది ఏపీ సర్కార్. అందుకోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే అనుమతి లేకుండా అడ్డగోలుగా నడుపుతున్న ఆశ్రమాలపై ఉక్కుపాదం మోపాలని… మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ సీరిసయ్ అయ్యారు సీఎం చంద్రబాబు.
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషిత ఆహారానికి నలుగురు విద్యార్థులు బలయ్యారు. మిగిలిన బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అయితే,.. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ సర్కార్.. దర్యాప్తు నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఘటనపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు 10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వసతిగృహాలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని, వాటికి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. అలాగే అనుమతులు లేని అనాథాశ్రమాన్ని మూసివేయించి, అక్కడున్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు.
వారంతా ఆదివాసీ పిల్లలు. బువ్వ పెడతాం, బడికి పంపి అక్షరాలు నేర్పుతాం.. మా దగ్గరకు పంపండి అంటే పిల్లల బతుకు బాగుపడుతుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. నమ్మి ఆ పాస్టర్ వెంట పంపించారు. మత ప్రచార సంస్థ ట్రస్ట్ ముసుగులో నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేరిన ఆ పసిపిల్లలు అక్షరం ముక్క నేర్చుకోకముందే కలుషిత ఆహారం తిని తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వసతిగృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని నలుగురు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వసతిగృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుణ్ని అరెస్టు చేశారు. ఆయనపై హత్య కేసు నమోదు చేశారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్‌కుమార్ కోటవురట్ల మండలం కైలాసపట్నం లోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపంలో చిన్న రేకుల షెడ్‌లో ఓ ప్రార్థనా మందిరం నడుపుతున్నారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ట్రస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వసతిగృహం నిర్వహణకు అనుమతులు తీసుకోలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో పరిచయస్తులైన పాస్టర్ల ద్వారా విశ్వాసకులతో మాట్లాడి వారి పిల్లలను ఆశ్రమంలో చేర్పించుకున్నారు. మొత్తం 97 మంది పిల్లలు ఆ హాస్టల్‌లో ఉంటూ సమీప పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లికి చెందిన కొంతమంది సమోసాలు, కోటవురట్ల మండలం పందూరులో జరిగిన పెద్దకర్మలో మిగిలిన చికెన్ బిర్యానీ, అన్నం, కూరలు, సాంబారు, బూరెలు తెచ్చి ఇచ్చారు. వీటిని తిన్న తర్వాత తొలుత చింతపల్లి మండలం నిమ్మలపాలేనికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి జోషువాకు వాంతులయ్యాయి. హాస్టల్ సిబ్బంది ఆ బాలుణ్ని కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరికొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో పాస్టర్ విషయం బయటకు పొక్కుతుందేమోనని కంగారుపడ్డారు. పిల్లల కుటుంబసభ్యులకు సమాచారం అందించి, వెంటనే ఇళ్లకు తీసుకెళ్లిపోవాలని కోరారు. ఆదివారం ఉదయం దాదాపు 50 మంది పిల్లల కుటుంబసభ్యులు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను తీసుకెళ్లారు. ఇళ్లకు వెళ్లాక పరిస్థితి విషమించి, జోషువా ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కొయ్యూరు మండలం రెల్లలపాలేనికి చెందిన మూడో తరగతి విద్యార్థిని గెమ్మెలి భవాని , చింతపల్లి మండలం జంగంచుట్రకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని కొర్ర సద్దా మృత్యువాత పడ్డారు. గ్రామంలోని వైద్యసిబ్బంది ద్వారా విషయం వెలుగు చూసింది. పిల్లలందరినీ ఆసుపత్రుల్లో చేర్పించాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించడంతో వారిని సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. అధికారులు ఆశ్రమానికి వచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అనాథాశ్రమాన్ని నడుపుతున్న పాస్టర్ కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమానికి కూతవేటు దూరంలోనే కోటవురట్లలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి ఉంది. పిల్లలు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుంటే మర్నాడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇళ్లకు పంపించేశారు తప్ప స్థానికంగా వైద్యం అందించలేదు. సకాలంలో చికిత్స అందించకపోవడమే నలుగురు పిల్లల మరణానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఘటనను సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
ఇక కలుషిత ఆహార ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయడంతో విచారణలో ఎలాంటి నిజాలు బయటపడనున్నాయి…? ఐదుగురు కమిటీ సభ్యలు నివేదికలో ఏం తేలనుంది..? ఇకనైనా ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా ఉంటుందా..? అది సాధ్యమేనా..? సీఎం సీరియస్‌నెస్ ఏ మేర పని చేస్తుంది అన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి.