Site icon Swatantra Tv

వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు TFJA ఫిర్యాదు

సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెను దుమారం లేపింది. అసలు వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడ కూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని వేణుస్వామి వాళ్ళు విడిపోతారంటూ జాతకం చెప్పాడు.

గతంలో సినిమా రిలీజ్ లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలు అయినా కూడా బుద్ది రాని వేణుస్వామి నాగ చైతన్య – శోభితలపై అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ..తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ నీరెళ్ల శారద.. వేణుస్వామిపై, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిపించి అతని వివరణ అడుగుతామని అన్నారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్షినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మీతో పాటు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, సెక్రటరీ వేదుల మూర్తి, మెంబెర్స్ సువర్ణ, తేజస్విని సజ్జ, భాగ్యలక్ష్మి, యస్.కుమార్ మరియు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Exit mobile version