స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. తమ దగ్గర ఉన్న రూ.2వేల నోట్లను ఎలాగైనా మార్చునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో రూ.2వేల నోట్లను వ్యాపారులకు ఇస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారులు వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.2వేల నోట్లు తీసుకోబడవంటూ ఓ వైన్ షాపు నిర్వాహకులు బోర్డు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణంలోని ఓ వైన్ షాపు ముందు తెల్ల కాగితంపై రూ.2000 నోట్లు తీసుకోబడవు.. దుర్గ వైన్స్ అని రాసి పెట్టారు. ఇలా బోర్డు పెట్టడంతో కొంతమంది మందుబాబులు ఇబ్బంది పడుతున్నారట. గడువు ఉన్నా సరే నిర్వాహకులు రూ.2000నోట్లు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైన్ షాప్ ఓ పార్టీ నేతకు సంబంధించినదిగా తెలుస్తోంది.
మరోవైపు చిరు వ్యాపారులు సైతం ఈ నోట్లను తీసుకోవడం లేదు. ఇక రూ.2వేల నోట్ల ఉపసంహరణతో బంగారం అమ్మకాలు కూడా పెరిగాయి. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2లక్షల వరకు రూ.2000 నోట్లు తీసుకుంటున్నామని షాపు యజమానులు చెబుతున్నారు. కాగా నేటి నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ.