Site icon Swatantra Tv

లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫోకస్

   లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యాచ రణపై దిశానిర్దేశం చేయను న్నారు. దీంతోపాటు ఏఐసీసీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్, సభల నిర్వహణ ఎక్కడన్న దానిపై కూడా టీపీసీసీ నేతలతో చర్చించనున్నారు.

   మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల కోసం తన ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటు న్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు చోట్ల ప్రచారం నిర్వహించేలా సీఎం సభల షెడ్యూల్‌ తయారవుతోంది. తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. రేపు నిర్వహించే సభకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక భేటీలు నిర్వహిస్తోంది టీపీసీసీ. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతల నేతృత్వంలో అసెంబ్లీ స్థాయి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సమావే శాలను ఈనెల 20లోపు ముగించాలని టీపీసీసీ నిర్ణయించింది.

   ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవటం, రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు ఆదివారం రానున్నారని, అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.రాష్ట్రంలో మూడు స్థానాలకు మినహా మిగిలిన 14 చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయా చోట్ల అభ్యర్థులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించాల్సి ఉంది. కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేసినా కొలిక్కి రావటం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమతమ కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుమ్మల యుగంధర్‌, వీవీసీ ట్రస్ట్‌ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. స్క్రీనింగ్‌ కమిటీలో వడపోత తర్వాత ముగ్గురు, నలుగురు పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా చేరింది.

Exit mobile version