Site icon Swatantra Tv

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ అవనున్నారు. గత ఏడాది జూలైలో ప్రధానిని కలిసిన సీఎం…. మళ్లి ఆరు నెలల తర్వాత ఇప్పుడే కలుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం SLBCలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్టాడారు.

ఇక, తెలంగాణలో పలు ప్రాజెక్టులపై సీఎం కేంద్ర సాయం కోరనున్నారు. మూసీ సుందరీకరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరనున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రధానికి వివరించనున్నారు.

మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయనున్నట్టు ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం కేంద్రానికి పంపించే తీర్మానాన్ని సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది.

ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌ అగ్రనేతలను కలసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version