Site icon Swatantra Tv

రైతులకు అండగా ఉంటాం.. పదివేల పరిహారం ఇస్తాం- KCR

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM KCR) తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేసీఆర్‌ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక పంపబోమని చెప్పారు. ఇప్పటికే పంపిన నివేదికలకు కేంద్రప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందలేదన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోగా.. తొలుత ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఎకరానికి 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలని రైతులు కేసీఆర్‌ను కోరారు.

పంట పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 28వేల 255 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. లక్షా 29వేల 446 ఎకరాల్లో మొక్కజొన్న, 72వేల709 ఎకరాల్లో వరి, 8వేల865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నదని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్‌ తెలిపారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల ద్వారా వ్యవసాయం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చిందని, రైతులు అప్పుల ఊబిలో నుంచి తేరుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువని అన్నారు. అద్భుతమైన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని తెలిపారు.

 Read Also:  TSPSC పేపర్ లీక్ స్కాంలో సంచలన విషయాలు

Follow us on:   Youtube   Instagram

Exit mobile version