Site icon Swatantra Tv

వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నేత..?

వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ టీడీపీ నేతను బరిలో దించనున్నారా..? ప్రత్యర్థి నాయకుడికి టికెట్‌ ఇస్తే విజయం సాధ్యమేనా..? పచ్చ సైన్యంలో ఒకరైన ఆ నాయకుడి బలాబలాలపై సర్వే జరుగుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇంతకు ఆ అభ్యర్థి ఎవరు..? తెలుగు తమ్ముడిపై వైసీపీ అధినేత ఫోకస్‌ ఎందుకు..? సర్వేల సంగతేంటి..?

అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ పావులు కదుపుతున్నారు. వైనాట్‌ 175 అన్న నినాదంతో ఎన్నికల రణరంగంలోకి దిగిన ఆయన.. 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే 24 పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ అనకాపల్లి సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగే రేసు గుర్రం ఎవరన్నది ఇప్పటికీ ప్రకటించలేదు. గత ఎన్నికల్లో అనకాపల్లి స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో సత్యవతికి ఎంపీ సీటు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే,.. గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎంపీ సీటును కేటాయించాలన్న భావనలో ఉన్న జగన్‌ అందుకు సరైన నాయకుడి కోసం కసరత్తు చేస్తున్నారు.

అనకాపల్లి పార్లమెంట్ నుంచి బీసీ అభ్యర్థిని దింపాలని నిర్ణయించినా.. అందుకు సరైన నాయకుడు ఎవరనే అంశంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ పేరును పరిశీలిస్తోంది హైకమాండ్‌. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఆయనకు టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుంది..? గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్న అంశాలపై జగన్‌ సర్వే చేయిస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం.

వైసీపీ అధినేత జగన్‌ గద్దె దించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు కూటమిగా ఆయనను మట్టికరిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే,.. టికెట్‌ ఆశించిన బండారు సత్యనారాయణకు పొత్తుల కారణంగా నిరాశ మిగిలింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు బండారు. అయితే,.. పొత్తుల్లో భాగంగా ఈసారి పెందుర్తి నుంచి జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో తనకు టికెట్ దక్కకపోవడంపై బండారు సత్యనారాయణ టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండారుకి గాలెం వేసే పనిలో ఉంది వైసీపీ హైకమాండ్‌. ఈ మేరకు తమ పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఫోకస్‌ పెట్టారు జగన్‌

మరోపక్క టీడీపీపై అసంతృప్తిగా ఉన్న బండారు సత్యనారాయణ వైసీపీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో బండారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ మహిళా మంత్రులను కించపరిచేలా వ్యాఖ్యానించడం వంటి అంశాలు ఆయనకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మంత్రి రోజాపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అలాంటి నేతను పార్టీలోకి తీసుకువచ్చి టిక్కెట్ ఇస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నదానిపై జగన్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బండారుపై వైసీపీ అధినేత సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వేల సానుకూల ఫలితాలు వస్తే ఆయనకు త్వరలోనే వైసీపీ తీర్థం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు బండారు సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి స్వయానా మామ అవుతారు. బండారును వైసీపీలోకి తీసుకువస్తే శ్రీకాకుళం పార్లమెంటుతోపాటు అనకాపల్లి విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలోను టీడీపీని దెబ్బ తీయవచ్చన్న వ్యూహంలో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు బండారుకు వైసీపీలో లైన్‌ క్లియర్‌ కాకపోతే ప్రస్తుతం జగన్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న ఒక నేతకు ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి జిల్లాకు చెందిన నాయకుడు కావడం… అందులోనూ బిసి సామాజికవర్గానికి చెందిన నేతకావడంతో ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా వైసీపీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. మరి ఇలాంటి పరిణామాల మధ్య జగన్‌ వ్యూహంలో భాగంగా అనకాపల్లి నుంచి బండారు బరిలో దిగుతారా..? లేదంటే తన బలగంలో ఉన్న నాయకుడే సరైనోడు అన్న అంచనాకు వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Exit mobile version