Site icon Swatantra Tv

కూలీ పైసలతో చదువుకుని.. ఐఏఎస్ కు ఎంపికైన తరుణ్‌

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో తెలంగాణ యువత ప్రతిభ కనబరిచారు. వందలోపు ర్యాంకుల్లో జయకేతనం ఎగురవేశారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మంచన్‌ పల్లికి చెందిన బాబయ్య, శశికళ దంపతుల కుమారుడు తరుణ్‌. కటిక పేదరికంలో పెరిగి తల్లిదండ్రులు ఇచ్చిన కూలీ పైసలతో చదువుకుని 23 ఏళ్లకే సివిల్స్‌ 231వ ర్యాంకు సాధించారు.

తరుణ్‌ 2023వ సంవత్సరంలో వీజేఐటీ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాడు. ఇంటర్‌ చదివే సమయంలోనే ఐఏఎస్‌ కావాలనే తన ఆశయానికి పదును పెట్టి సివిల్స్‌ కోసం సన్నద్ధమయ్యానని తరుణ్‌ తెలిపాడు. పేదరికంలో ఉన్నప్పటికీ తన చదువు ఆర్థిక భారం అవుతుందని తన తల్లిదండ్రులు ఏనాడూ వెనకడుగు వేయలేదని.. వారి ప్రోత్సాహంతోనే అనుకున్న ఆశయం సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. పేదలకు సేవ చేసే అవకాశం వచ్చిందని .. భవిష్యత్‌లో తాను పని చేసే ప్రాంతంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని తరుణ్ తెలిపారు.

పేదరికంలో ఉన్నప్పటికీ కొడుకు చదువు కోసం ఎంతో కష్టపడ్డామని.. ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ… కూళీలుగా పని చేస్తూ చదివించామని తరుణ్ తల్లిదండ్రులు తెలిపారు. కొడుకు ఐఏఎస్‌కు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు తరుణ్ తల్లిదండ్రులు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తరుణ్ ఇంటికి వెళ్లి అభినందించారు. మారుమూల గ్రామానికి చెందిన తరుణ్ ఐఏఎస్ ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇష్టపడి చదివితే ఆశయాలు సాధించడం చాలా సులువని, అందుకు పేదరికం అడ్డంకి కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Exit mobile version