Site icon Swatantra Tv

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్‌ వ్యూహాలు

      రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరులోని రెండు స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పాలమూరు ప్రజా దీవెన సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

      ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్.. పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగుపెట్టబోతు న్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్నందుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…ఇక దేశ రాజకీయాల పై దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదన రంగంలోకి దిగనుంది. సాయంత్రం సీఎం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని..స్థానిక ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి లోక్‌సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు న్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయ యాత్రను చేపట్టారు. ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.75 సంవత్సరాల తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి కేడర్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రికి అపురూపమైన స్వాగతం పలకాలని..అందుకోసం బహిరంగ సభకు స్వచ్చందంగా తరలిరావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ కూడా అప్రమత్తంగా ఉంది.

Exit mobile version