Site icon Swatantra Tv

ధారావి రీ డెవలెప్‌మెంట్‌ ప్రాజెక్టును ఆపడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు (DRP)నిర్మాణ పనులను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదానీ గ్రూప్‌కు అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.

యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన కోర్టు.. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, కొన్ని రైల్వే క్వార్టర్ల కూల్చివేత కూడా జరిగిందని పేర్కొంది. సెక్లింక్ గతంలో దాఖలు చేసిన బిడ్‌ను రద్దు చేసిన తర్వాత ధారావి ప్రాజెక్టును అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు అప్పగించాలనే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సెక్లింక్ సవాలు చేసింది.

అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చెల్లింపులను ఒకే ఎస్క్రో ఖాతా నుండి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైల్వే లైన్‌ను కూడా అభివృద్ధి చేసి ప్రాజెక్టులో చేర్చడం వలన బాంబే హైకోర్టు నిర్ణయం సమర్థనీయమని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం, అదానీ ప్రాపర్టీస్‌కు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను మే 25కి వాయిదా వేసింది.

ధారావి పునరాభివృద్ధి కోసం మొదట రూ.7,200 కోట్లకు బిడ్ వేసిన సెక్లింక్ టెక్నాలజీస్, పెంచడానికి 20 శాతం ఆఫర్‌తో తాము సిద్ధమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తన సవరించిన బిడ్‌ను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని సెక్లింక్‌ను బెంచ్ ఆదేశించింది.

2019లో సెక్లింక్ బిడ్‌ను రద్దు చేసి, 2022లో కొత్త టెండర్ జారీ చేయాలనే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గతేడాది డిసెంబర్‌లో బాంబే హైకోర్టు సమర్థించింది. చివరికి ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌కు అప్పగించింది. తరువాత సెక్లింక్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

2019 , 2022 మధ్య ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను, COVID-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరెన్సీ హెచ్చుతగ్గులు , పెరుగుతున్న వడ్డీ రేట్లను ఉటంకిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

Exit mobile version