Site icon Swatantra Tv

బాబా రామ్‌దేవ్‌పై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

   పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తారా అటూ చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు రాందేవ్‌ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి క్షమాపణలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామని, కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం తమకు లేదని కోర్టుకు తెలిపారు. వీరి వివరణపై జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పతంజలి సంస్థ చేసేది మంచి పనే అయినా అల్లోపతిని తగ్గించి చూపించ కూడదని చెప్పింది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది కోర్టు.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణా మాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను వీరు ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

Exit mobile version