Site icon Swatantra Tv

కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు

దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీ 25 సీట్లు గెలిచే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ప్రధాని మోదీ ఎన్డీఏ తరుపున మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా కర్ణాటక పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో బీజేపీ రాణించాలన్నా,, కేంద్రంలో ఇండియా కూటమి గెలవాలన్నా.. రెండు పార్టీలకూ కర్ణాటకలో విజయమే కీలకం..

దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీగానే ముద్రపడిన భారతీయ జనతాపార్టీ ఈసారి దక్షిణాది పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ.. చరిష్మా ఇప్పటికీ ఉంది. అయోధ్య రామ మందిరం వంటి కీలక అంశాలు తమ విజయానికి దోహద పడతాయనే ధీమాతో కాషాయదళంఉంది. ఎన్డీఏ తరుపున 400 సీట్లు సాధించాలన్న వ్యూహంలో భాగంగా మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. గతంలో మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ.. గతంలో కర్ణాటకలో అధికారం లోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో 25 సీట్లు సాధించింది. అందువల్లనే 2024 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 సీట్లు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కాగా, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాదరణలో ముందు ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే.. 28 స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.

కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు. 2024 లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 దశల్లో జరుగుతు న్నాయి. కర్ణాటకలో 2 దశ , 3 దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో 2024 ఏప్రిల్ 26న మొదటి విడతలో 14 నియోజకవర్గాలు, 2024 మే 7న రెండో విడతలో 14 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగు తాయి. తొలి విడత ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. రానున్న ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, బీజేపీ , జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ 25 స్థానాలు, జేడీఎస్ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. 2024 ఏప్రిల్ 26న ఉడిపి, చిక్మంగళూరు, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుముకూరు, మాండ్య, మైసూరు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబళ్లాపూర్, కోలార్ ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 2024 మే7 న రెండో విడతలో చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయ్ చూర్, బీదర్, కొప్పల్, బళ్లారి. హవేరి, థార్వాడ్, ఉత్తర కన్నడ, దవణగెరె, శివమొగ్గ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.

బీజేపీ కర్ణాటకపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2019లో బీజేపీ కర్ణాటకలో 25 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం ఆ 25 స్థానాలనూ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2004 నుంచి 2019 వరకూ నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాషాయ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ.. పార్లమెంటు స్థానాలు పెంచుకొంది. 2019లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు నెగ్గితే, కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో స్ధానానికే పరిమితమయ్యాయి. మరో స్థానంలో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ నెగ్గాడు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు ఓట్ బ్యాంక్ విపరీతంగా పెంచుకుంది. దీంతో 2024 పార్లమెంటు ఎన్నికల విషయంలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వం లోని జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25, జేడీఎస్ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. బీజేపీ మొదటి నుంచి లింగాయతుల పార్టీగా పేరు పొందింది. లింగాయతుల తర్వాత బలమైన వక్కలింగ సామాజిక వర్గంపై పట్టు ఉన్న జేడీఎస్ తోపొత్తు పెట్టుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దాదాపు దివాలా తీసిన జేడీఎస్ మనుగడకోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ, కుమార స్వామి ఏమేరకు వక్కలింగ ఓట్లను కాషాయ దళానికి మరలిస్తారే అంశం చర్చనీయాంశం అయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ భారీ అంచనాలతోనే 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మైనారిటీలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ కు పడతాయనే భావనతో సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల ప్రభావం రాష్ట్రంలో బాగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ గ్యారంటీల ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలను పెంచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకూ విద్యుత్ రాయితీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, పేదలకు ఉచితబియ్యం వంటి పథకాలు ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షింప జేసేలా ఉన్నాయి. కర్ణాటక సిఎం సిద్దరామయ్య ప్రభుత్వం ఈ పథకాల అమలుకు బడ్జెట్ లో ఏకంగా 50వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో గ్యారంటీగా పథకాలు అందుతాయనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమైంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో పార్టీకి లభించిన ఆదరణను పార్టీ క్యాష్ చేసుకోవాలను కుంటోంది.కర్ణాటకలో ఈసారి లోక్ సభ ఎన్నికలు మాత్రం బీజేపీకి నల్లేరు పై నడకకాదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ తప్పదు. మోదీ కి గల ప్రజాదరణ, రామ మందిరం వంటివి బీజేపీకి ఏమేరకు మేలు చేస్తాయో.. అన్నది ప్రశ్న. కాంగ్రెస్ గ్యారంటీల ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Exit mobile version