Site icon Swatantra Tv

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 258 పాయింట్ల లాభంతో 62,983 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 18,672 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.43దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి అక్కడ మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. అలాగే బుధవారం రాత్రి వడ్డీరేట్ల పెంపుపై ఫెడ్‌ తమ నిర్ణయాలను ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం తగ్గొచ్చని.. రేట్ల పెంపునకు ఫెడ్‌ విరామమివ్వొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా సూచీలు రాణించాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు నిన్న 14 నెలల గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా మార్కెట్లు సాంకేతికంగా బుల్‌ మార్కెట్‌ జోన్‌లోకి ప్రవేశించాయని నిపుణులు అంటున్నారు.

Exit mobile version