Site icon Swatantra Tv

బీజేపీ యూటర్న్ తో జగన్ కి షాక్

   బీజేపీ పెద్దలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు.. నిన్న, మొన్నటి వరకు జగన్ తో దోస్తీ చేసిన బిజెపి పెద్దలు తాజాగా చంద్రబాబుతో జతకట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టిడిపి – జనసేనతో బిజెపి పెద్దలు జట్టు కట్టారు.. 2019 నుంచి అన్ని ముఖ్యమైన సందర్భాల్లోనూ జగన్ కు తోడుగా ఉన్న బిజెపి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనక వ్యూహం ఏంటి? …వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలిచే అవకాశం లేకనే బిజెపి పెద్దలు చంద్రబాబుతో చేయి కలిపారా?

ఏపీలో ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలు ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టిడిపి ,జనసేన, బిజెపి కూటమి మధ్యే ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధం అయింది. మరోవైపు టిడిపి- జనసేన కూటమికి తాజాగా బిజెపి కూడా తోడైంది. దీంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉన్నట్టు వైసిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ ఒక్కసారి యూటర్న్ తీసుకుని జనసేన, టిడిపి కుటమితో చేతులు కలపడం పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ వర్గాలు సైతం షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. బిజెపి పెద్దల తాజా నిర్ణయంతో వైసిపి అధినేత జగన్ తీవ్ర అసంతృప్తిగా వున్నారు. బిజెపి సడన్ గా యూటర్న్ తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి… వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాదనే భావనతోనే జనసేన టిడిపితో జుట్టు కట్టారా అనే ప్రశ్నలు వైసిపి వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు బిజెపి నిర్ణయంతో ప్రధాని మోడీని అలాగే బిజెపి నేతలను ఏమి అనలేని పరిస్థితి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిది. టిడిపి- జనసేన-, బిజెపి సిద్దం సభా వేదికగా జగన్ మొదటి సారి స్పందించారు. అయితే ఇక్కడ కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు సంధించారు తప్ప బిజెపిపై ఒక మాట కూడా మాట్లాడలేదు. కేంద్ర పెద్దలపై విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని జగన్ ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలా అని రాజకీయంగా టార్గెట్ చేయక పోతే ఎన్నికల్లో నష్ట పోతామని జగన్ కూడా మథన పడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

    2019 ఎన్నికలకు ముందు నుంచీ వైసిపి , బిజెపి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది. అంతేకాక ప్రధాని మోడీతో పాటు బిజెపి నేతలను చంద్రబాబు పదేపదే టార్గెట్ చేస్తూ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై గతంలో తిరుపతిలో జరిగిన రాళ్లదాడి వెనక కూడా టిడిపి ఉందనే విమర్శలు అప్పట్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. టిడిపి, బిజెపి మధ్య విభేదాలు రావడంతో బిజెపి పెద్దలు జగన్ కి ఆ ఎన్నికల్లో పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలతో సీఎం జగన్ సఖ్యతగా ఉంటూ వచ్చారు. బిజెపి అనేక నిర్ణయాలకు వైసీపీ పార్లమెంట్ లోనూ , బయట మద్దతు ప్రకటించింది. వైసిపి- బిజెపి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకోడని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం బిజెపి పరోక్షంగా తనకు సహకరిస్తుందన్న ఆశలు పెట్టుకున్నారు . అయితే బిజెపి పొత్తుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. పాత మిత్రులను ఎన్డీఏలోకి ఆహ్వానించే క్రమంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కలిసి పని చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోకుండా వైసిపి నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ పక్కనపెట్టి బిజెపి ,టిడిపి, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీలో కూడా వచ్చేది టిడిపి- జనసేన- బిజెపి కూటమే అని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

    2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ చేసింది. అయితే 2014 ఎన్నికల్లో వైసిపి కేవలం 67 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది . తాజాగా ఈ మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో మరోసారి 2014 ఫలితాలే పునరావృత్తం అవుతాయని టిడిపి నేతలు చెప్తున్నారు. అయితే 2014 నాటికీ, నేటికీ పరిస్థితులు మారాయని వైసీపీ నేతలు చెబుతున్న మాట. 2014లో కొత్త రాష్ట్రం కావడం, చంద్రబాబు పరిపాలనానుభవం, మోడీకున్న ఇమేజ్ ఆ కూటమిని గెలిపించాలని ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని అభిప్రాయాన్ని వైసిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.

     కొత్తగా కూటమి గా ఆవిర్భవించిన తర్వాత టిడిపి బిజెపి జనసేనఈ నెల 17 న భారీ బహిరంగ సభను చిలకలూరి పేటలో ఏర్పాటు చేశాయి. కూటమి ప్రచారం అక్కడినుంచే మొదలవుతుంది. ఈ సభకు ప్రధాని మోడీ సైతం హాజరవుతున్నారు. పొత్తు కుదిరిన తరువాత మొదటి సారి మోడీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పై మోడీ ఎలాంటి ఇలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందని ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మైనింగ్, ఇసుక, మద్యం ఇలా అన్ని రకాలుగా వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మోడీ కూడా అదే లైన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

Exit mobile version