Site icon Swatantra Tv

పలివెల క్షేత్రానికి పోటెత్తుతున్న శివభక్తులు

మహదేవుని మహాశివరాత్రి వేడుక వచ్చిందంటే ఆ గ్రామమంతా శివనామస్మరణతో మార్మోగిపోతుంది. ప్రతి నిత్యం ఆలయంలో శివధ్యానం, శివారాధనలు జరగగా..మహా శివరాత్రికి గ్రామమంతా శివరాత్రి సంబరాలు అంబరాన్నంటేలా కొనసాగుతాయి. పావన గోదావరి తీరాన వెలసిన ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పలివెల. ఆ గ్రామంలో కొలువైన దేవ దేవుడు కొప్పేశ్వర స్వామి. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పలివెల
పల్లె భక్తజనులతో కిటకిటలాడుతోంది.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కుగ్రామం పలివెల. పల్లవులు పాలించిన గ్రామం కావడంతో దీనికి పలివెల అనే పేరొచ్చిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ అగస్థ్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, స్వామివారు కేశాలు కలిగిన శివరూపంలో ఉండడంతో ఈ ఆలయాన్ని శ్రీ కొప్పేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారని ఆలయ పెద్దలు చెబుతున్నారు. పార్వతీ, పరమేశ్వరులు కొలువైవున్న పలివెల గ్రామాన్ని కోనసీమ కైలాసంగా భక్తులు భాసిస్తారు.

దేశంలో ఏ శివాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదే, శివలింగంపై కేశాలు ఉండడం. దీనికి పురాణ వైశిష్యం, చారిత్రక నేపథ్యం ఉన్నట్టు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. పరమేశ్వరుని పక్కనే పార్వతి అమ్మవారు సైతం ఆశీనులు కావడం ఈ ఆలయంలో మరో విశేషం. దేశంలోని ఏ శైవక్షేత్రంలోను ఈ రీతిన అమ్మవారు శివాలయ గర్భగుడిలో కొలువై ఉండడం లేదని ఆలయ నిర్వాహకులు, అర్చకస్వాములు తెలియజేస్తున్నారు. గుడి ప్రాంగణంలో అమ్మవారికి విడిగా ఆలయం ఉండడం సహజం. అయితే, ఎన్నో వింతల నిలయంగా ఈ ఆలయం పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది.

ఆలయ చరిత్ర ప్రకారం.. పూర్వం అగస్ధ్యుడు ప్రతిష్ఠించిన శివాలయం అగస్తేశ్వరస్వామి ఆలయంగా పేరుపొందింది. శివదేవునికి మహాభక్తుడైన ఓ అర్చకుడు ఈ ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్యపూ జలు చేసేవాడు. అయితే, విషయవాంఛల వలయం నుంచి తప్పించుకోలేక ఓ సుందరరాశి మోహంలో పడిపోతాడు. ప్రియురాలి కంటే ఏదీ ముఖ్యం కాదనుకునే బలహీన స్థితికి చేరిన ఆ అర్చకుడు…తాను నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే దైవానికి, తన ప్రియురాలికి సమర్పించిన పూలమాలలు తెచ్చి వేసేవాడు. శివదేవునికి ఆగ్రహం వస్తే ఏమవుతారు… ముక్కంటి మూడో నేత్రం తెరిస్తే ఏమవుతారు…? ఎవరైనా కాలి బూడిద అవుతారు. అయితే, భక్తవరదుడు, భక్తజనబాంధవుడైన శివదేవుడు.. ప్రియ భక్తుడు తనకు కళకం తెచ్చేపని చేసినా..ఆగ్రహం చెందడు. పైగా వరాలొసగుతాడు.

       ప్రతి నిత్యం ప్రియరాలి తలలో పెట్టిన పుష్పమాల తెచ్చి అర్చకుడు శివదేవునికి సమర్పించేవాడు. శివార్చనలో ఏ విధమైన లోపం లేకుండా అన్ని యధావిధిగా చేస్తున్నా…ఈ అనుచితకార్యాన్ని మాత్రం వీడలేకపోయేవాడు. ఆ ఆలయ అర్చకుని తీరులో వస్తున్న మార్పు గురించి భక్తులు ఆ దేశపు రాజునకు తెలియజేయగా, ఆ రాజు అర్చకుని పరీక్షించడానికి వచ్చాడు. భక్తులందరికీ ఇచ్చిన విధంగానే పత్ర, పుష్ప, తోయాలను ఇచ్చాడు. అయితే, మహారాజుకు అర్చకుడు ఇచ్చిన పూలమాలలో కేశాలు కనిపిం చాయి. ఆగ్రహం చెందిన రాజు… ఈ కేశాలు ఎవరివి అని నిలదీశాడు. దీంతో, అర్చకునికి ముచ్చెమ టలు పట్టి మాటలు మూగబోయాయి. ఆ క్షణంలో శివదేవుని ప్రార్థిస్తూ…ఆ కేశాలు ఈశ్వరుడివే అని చెప్పాడు.

      ఆ రోజు అలంకరణ పూర్తి కావడంతో..మరుసటి దినాన రాజు వచ్చి శివలింగం దర్శించాడు. శివలింగంపై కొప్పు కనబడింది. అయితే, అర్చకుడు శివలింగంపై కొప్పును అమర్చాడేమో అనే ఉద్దేశంతో ఆ కొప్పును లాగమని అర్చకుని ఆదేశించాడు. భయపడుతూ, భగవంతుని ప్రార్థిస్తూ… అర్చకుడు శివలింగం నుంచి కొప్పును లాగాడు. అయితే, అక్కడ రక్తధారలు స్రవించాయి. దీంతో, అర్చకుడి వాక్కులు నిజమేనని రాజు భావించి, అర్చకుని క్షమాపణ కోరుతాడు. జుత్తుగపాడు అగ్రహారాన్ని ఆ అర్చకునకు మాన్యంగా సమర్పిస్తాడు. మహదేవునికి మహాపరాధం చేసినా, తనను కాపాడి..కానుకలు, అగ్రహారాలు రాజుద్వారా ఇప్పించిన శివదేవుని భక్తజన పరాత్పరత చూసి…శివదేవుని విగ్రహం ఎదుట.. తన పాపాలు క్షమించమని ఆ అర్చకుడు బోరున విలపించి ఎన్నోరీతుల ప్రార్థించాడు. అప్పటి నుంచి అగస్థ్యేశ్వర ఆలయం కొప్పులింగేశ్వరస్వామి ఆలయంగా మారిపోయిందని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.

పచ్చని ప్రకృతి మధ్య, గోదావరి తీరాన అలరారే ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూంటారు. శివరాత్రి వేడుకల్లో ఇక్కడ భక్తజన వరద ప్రవహిస్తుంది. శివరాత్రి నాడు ఆలయంలో విశేష పూజలు చేస్తారు. పది రోజుల పాటు ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఆలయ చరిత్ర ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడ మహా మండం నిర్మించాడు. ఈ మండపంలో శివరాత్రి పర్వదినంనాడు స్వామి, అమ్మ వార్ల కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. శివరాత్రికి రెండు రోజుల ముందు అంకురార్పణతో ప్రారంభమయ్యే మహా శివరాత్రి ఉత్స వాల్లో రథోత్సవం, ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే విశేషమైన ఏర్పాట్లు చేస్తారు. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, మజ్జిగ పంపిణీ తదితర అన్ని ఏర్పాట్లు చేశారు.

కోనసీమ ముఖ ద్వారం రావులపాలేనికి పదమూడు కిలోమీటర్ల దూరంలో పలివెల పుణ్యక్షేత్రం ఉంది. మహాశివరాత్రి వేడుకల్లో రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండువగా సాగే ఈ రథోత్సవ వేడుక చూడడానికి అసంఖ్యాకం భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. శివరాత్రి వేడుకల్లో హర హర మహాదేవ, హరోం హర నామస్మరణతో కోనసీమలో మార్మోగిపోవడానికి ప్రధాన కారణం..పలివెల కొప్పులింగేశ్వరస్వామి ఆలయ వైభవమే కారణమని భక్తులు చెబుతారు.

Exit mobile version