ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ వాటిని పరిశీలించనున్నారు. ఎన్డీయే కూటమి పోటీకి దూరంగా ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకుంటే ఈనెల 16న విజేత పేరును ప్రకటిస్తారు. లేకుంటే ఈనెల 30 ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థిని ఎలాగైనా పోటీ నుంచి విరమింపజేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేయరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోటీ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని, అయినా హుందా రాజకీయాలు చేద్దామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అత్యంత హుందాగా, రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించారని కూటమి నేతలు కొనియాడారు.
అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కూటమి వైపు వచ్చారు. అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నికల్లో గెలవడం కంటే ప్రజల అభిప్రాయాలు, విలువలు ముఖ్యమని కూటమి నేతలకు ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలని తెలిపారు.