Site icon Swatantra Tv

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అసమర్థమైన ముఖ్యమంత్రి తీరుతో గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రులు తీసుకునే జీతంలో సగం ఖర్చుపెట్టైనా గురుకులాల్లో విద్యార్థుల చావులను ఆపాలన్నారు. తాను తొమ్మిదేళ్లు గురుకుల కార్యదర్శిగా పని చేసినప్పుడు పిల్లలను కంటికి రెప్పలా కాపాడనన్నారు. 420 రోజుల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 56 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని దుయ్యబట్టారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆరాధ్య స్వగ్రామానికి చేరుకున్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉన్నారు.

Exit mobile version