Site icon Swatantra Tv

లోకేష్‌ యువగళం పాదయాత్రకు రూట్‌మ్యాప్‌ రెడీ

కుప్పం టు ఇచ్చాపురం వరకూ లోకేష్‌ నడక
-వైఎస్‌, బాబు, జగన్‌ దారిలో లోకేష్‌
-పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌, బాబు, జగన్‌
-ఈసారి ఆ ఫార్ములా మళ్లీ హిట్టవుతుందా?
-400 రోజులు, 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్‌ సిద్ధం
-యువతను ఆకట్టుకోవడమే యువగళం లక్ష్యం
-కాలేజీ విద్యార్ధులతో చిట్‌చాట్‌
-జగన్‌,పవన్‌ రాకతో టీడీపీకి దూరమైన యూత్‌
అంతా అరవై దాటిన నేతలే దిక్కు
-లేకపోతే వారి వారసులే గతి
-జగన్‌-పవన్‌తో సమానంగా యూత్‌ కోసం యువగళం
-100 నియోజకవర్గాల్లో లోకేష్‌ పాదయాత్ర
-మరి లోకేష్‌ నడకలో నిరుద్యోగులు యువగళం వినిపిస్తారా?
-సమస్యల గుర్తింపు కోసం రంగంలోకి దిగిన రాబిన్‌శర్మ టీమ్‌
-పాదయాత్రకు ముందే 50 నియోజకవర్గాల సమస్యల గుర్తింపు
-లోకేష్‌ యువగళం పాదయాత్రకు రూట్‌మ్యాప్‌ రెడీ

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ర్టాల్లో పాదయాత్రకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్న సెంటిమెంటును లోకేష్‌ ‘యువగళం’ కొనసాగిస్తుందా? వైఎస్‌, చంద్రబాబు, జగన్‌ మాదిరిగా లోకేష్‌ తన పార్టీని పాదయాత్రతో గద్దెనెక్కిస్తారా? ఈ పాదయాత్ర టీడీపీకి గెలుపుమాత్ర అవుతుందా? ఆరుపదుల నేతలతో నిండిపోయిన టీడీపీకి, లోకేష్‌ ‘యువగళం’ నడక యువజనాన్ని తీసుకువస్తుందా? జగన్‌-పవన్‌ వైపు చూస్తున్న యూత్‌ను, లోకేష్‌ యువగళం పాదయాత్ర టీడీపీ మార్గం పట్టిస్తుందా? ఉద్యోగాలు రాని నిరుద్యోగులు యువగళం ఎత్తుతారా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‘యువగళం పాదయాత్ర’ ప్రకటన తర్వాత తెరపైకొచ్చిన చర్చ ఇది.

పార్టీకి దూరమైన యువతను తిరిగి ఆకర్షించడమే లక్ష్యంగా… టీడీపీ యువనేత లోకేష్‌ ‘యువగళం’ పేరుతో ప్రారంభించనున్న పాదయాత్ర, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. జనవరి 27న లోకేష్‌.. తన తండ్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి, పాదయాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర కొనసాగేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈపాటికే ఆమేరకు కొన్ని బృందాలు రూట్‌మ్యాప్‌ ఖరారు చేశాయి.

అటు లోకేష్‌ కూడా.. పాదయాత్రలో పాటించాల్సిన ఆరోగ్యసూత్రాలను, గత రెండునెలల నుంచే ముందస్తుగా పాటిస్తున్నారు. లోకేష్‌ యువగళం లోగో విడుదలయిన తర్వాత, దానిని సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం ల్పించేందుకు, టీడీపీ సోషల్‌మీడియా బృందం రంగంలోకి దిగింది.

యువకులతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు ఆ యువకులే కరవయ్యారు. పార్టీలో 70 శాతం మంది 60 ఏళ్లు దాటినవారే. పొలిట్‌బ్యూరోలోనూ సింహభాగం పెద్ద తలలే. యువనేతలకు సీనియర్లు అవకాలివ్వని దుస్థితి అది. ఒకవేళ ఇచ్చినా.. వారంతా సీనియర్ల వారసులే. పార్టీ అధినేత చంద్రబాబుకు ఇటు అటు కూర్చునేవారంతా అరవైదాటిన నేతలే. అటు ఒకవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ మరోవైపు జనసేనాధిపతి పవన్‌ వైపు, యువకులు పరుగులు తీస్తున్న పరిస్థితి.

రాజకీయాల్లో జగన్‌ రాక ముందువరకూ, టీడీపీకి యూత్‌ బలం. అయితే ముందు జగన్‌-తర్వాత పవన్‌ రాకతో, ఆ సీను మారింది. ఇప్పుడు టీడీపీకి యూత్‌లేకపోవడమే పెద్ద లోటు. ఇప్పుడు దానిని భర్తీ చేసే లక్ష్యంతో.. లోకేష్‌ వేయనున్న యువగళం అడుగుల వైపు, రాజకీయవర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. యువజనం ఏ స్థాయిలో యువగళం వినిపిస్తుందన్నదే ఆ ఆసక్తికి కారణం.

గత ఎన్నికల్లో యువకులు, నిరుద్యోగులకు జగన్‌ ఇచ్చిన హామీలు వారిని కట్టిపడేశాయి. వారిలో కొత్త ఆశలు నింపాయి. మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జగన్‌ ఇచ్చిన హామీ వారిని బాగా నమ్మించింది. వాటికి మించి.. స్వతహాగా యువకుడయిన జగన్‌ను, యువలోకం ఆదరించింది. జగన్‌ పాదయాత్ర, బహిరంగసభలన్నీ యువతరంగంతో కిక్కిరిసిపోయాయి. ఆ ఎన్నికల్లో.. యువనేతకు ఓ అవకాశం ఇద్దామని భావించి అందలమెక్కించింది. ఫలితంగా జగన్‌కు చిన్న వయసులోనే సీఎం అయ్యే అవకాశం లభించింది.

ఇప్పుడు పాదయాత్ర చేయనున్న లోకేష్‌కు, ఆ హామీలే బ్రహ్మాస్ర్తాలుగా మారనున్నాయి. మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయన్న ప్రధాన ప్రశ్నతో లోకేష్‌… వైసీపీ సర్కారును, అదే యువత ముందు ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువకులకు 5 వేల రూపాయలతో వాలంటీరు, మటన్‌కొట్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారన్న అంశాన్ని విస్తృతంగా ఉపయోగించుకోనున్నారు.

ఆ మేరకు యువత, నిరుద్యోగులకు జగన్‌ సర్కారు చేసిన మోసంపై, చిట్టా తయారుచేస్తున్నారు. దానిని పాద్రయాతలో, ప్రజల ముందు విప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆరకంగా పార్టీకి దూరమైన యువతను.. తిరిగి పార్టీ మార్గం పట్టించే లక్ష్యంతో, లోకేష్‌ యువగళం పాదయాత్ర సాగనుంది. అవి ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి.

పాదయాత్రలో మాట్లాడాల్సిన అంశాలు, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు.. పార్టీ వ్యూహకర్త రాబిన్‌శర్మ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం రోజున, 50 నియోజకవర్గాలకు పైగా సమస్యల జాబితాను, లోకేష్‌కు అందించనుంది. మొత్తం 100 నియోజకవర్గాల్లో, లోకేష్‌ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

పాదయాత్ర సందర్భంగా కాలేజీ విద్యార్ధులతో లోకేష్‌ భేటీ కానున్నారు. అక్కడ యూత్‌ సమస్యలు ప్రస్తావించనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని, పరాయి రాష్ర్టాలకు తరలిపోతున్న పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, విద్యార్ధులకు ఫీజు రీఅంబర్స్‌మెంట్‌, అధిక ఫీజులు, రోడ్లు, పెంచిన కరెంటు చార్జీలను ప్రస్తావించనున్నారు. పాదయాత్రలో కూడా ఈ సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించేందుకు లోకేష్‌ సిద్ధమవుతున్నారు. లోకేష్‌ పాదయాత్రలో యువజన సంఘాలు, నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఆయనను కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version