Site icon Swatantra Tv

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో కీలక ఉత్తర్వులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ అనర్హత వేటు తొలగిపోయే అవకాశం ఉంది. కాగా కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్‌ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని  వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్‌ కోర్టు మార్చి 23న రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది.

ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్‌ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్‌ కోర్టు విధించిన శిక్షపై రాహుల్‌ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌లు బీఆర్‌ గవాయి,పీఎస్‌ నరసింహ, సంజయ్‌కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాహుల్‌ తరపున న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం కేసి వేసిన గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారని కోర్టుకు తెలిపారు.

 

రెండేళ్ల శిక్షకు కారణాలను ట్రయల్‌ కోర్టు చెప్పలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పరువు నష్టం కేసు తీవ్రమైంది కాదని, బెయిల్‌ ఇచ్చే కేసని తెలిపింది. రాహుల్‌ను ఎన్నుకున్న ప్రజలతోపాటు.. ఆయన రాజకీయ జీవితంపైనా ప్రభావం పడుతుందని వెల్లడించింది. ఈ అంశాలన్నీ మేం పరిగణలోకి తీసుకొని ట్రయల్‌ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో రాహుల్‌ జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది.  మరోవైపు  సుప్రీంకోర్టుతో తీర్పుతో సోమవారం నుంచి రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతారని అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు.

Exit mobile version