విజయవాడ పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై ఓ పుస్తకం, ప్రజలను చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలతో కూడిన మరో పుస్తకాన్ని రజనీకాంత్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు అంటూ ఈ సందర్భంగా కొనియాడారు. తనకు ఆరేళ్లప్పుడు పాతాళభైరవి సినిమా చూశానని.. 13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని తెలిపారు. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేసేవాడినని.. 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశానని గుర్తుచేసుకున్నారు. ఇంత పెద్ద సభను చూస్తుంటే రాజకీయాల గురించి మాట్లాడాలనుందని.. కానీ నా అనుభవం వద్దని చెబుతోందని రజనీ వ్యాఖ్యానించారు.
నాన్నగారు నడిచిన నేల మీద శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ. ఆ మహానుభావుడి కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అన్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయ నాయకుడిగానూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప మనిషి అన్నారు. దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు బాలయ్య.


