Site icon Swatantra Tv

ముగిసిన రైసీ అంత్యక్రియలు

   ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు ముగిశాయి. షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్‌ నగరంలో జరిగాయి. ఇరాన్‌ అధ్యక్షుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. మరోవైపు రైసీ మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక వచ్చింది. ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు. ఘటన తర్వాత వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన దర్యాప్తు బృందం సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు నివేదికను ఉటంకిస్తూ తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.

  నివేదిక ప్రకారం హెలికాప్టర్ ముందు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించింది. ఎక్కడా నిర్దేశిత మార్గాన్ని దాటి వెళ్లలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు 90 సెకన్ల ముందు కూలిన హెలికాప్టర్‌ పైలట్ కాన్వాయ్‌లోని ఇతర రెండు హెలికాప్టర్లను సంప్రదించారు. మరోవైపు శకలాల్లో బుల్లెట్లు లేదా ఇతర పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొండను ఢీకొట్టిన తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గాలింపు కొనసాగింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు డ్రోన్‌ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం తెలిసిందని నివేదికలో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ సిబ్బంది, వాచ్‌టవర్‌ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదని తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తామని నివేదికలో వెల్లడించారు. ఆదివారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లాహియన్‌ సహా మరో ఆరుగురు మృతి చెందారు.

Exit mobile version