Site icon Swatantra Tv

వారం రోజులపాటు అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి జూన్ 4వ తేదీ వరకు అమెరికాలోని పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్ననున్నారు. రాహుల్ దౌత్య పాస్‌పోర్టుతో కాకుండా సాధారణ పాస్‌పోర్టుతో అమెరికా వెళ్లనున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన అనంతరం రాహుల్‌ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్ట్‌ను అధికారులకు అందించిన రాహుల్.. సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఢిల్లీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. సాధారణ పాస్‌పోర్టు జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని శనివారం ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం అధికారులు రాహుల్‌ గాంధీకి ఆదివారం సాధారణ పాస్‌పోర్టును పంపించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ అమెరికా పర్యటనకు మార్గం సుగమం అయింది.

అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు భారత సంతతి పౌరులతో సమావేశమవుతారు. వాషింగ్టన్‌ డీసీలో చట్టసభ సభ్యులు, మేధావులతో భేటీ కానున్నారు రాహుల్‌. జూన్‌ 4న న్యూయార్క్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జావిట్స్‌ సెంటర్‌లో విభిన్న రంగాలకు చెందిన వారితో ముఖాముఖిలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జూన్‌ 22 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు కొద్ది రోజుల ముందు రాహుల్‌ గాంధీ అమెరికాలో పర్యటిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Exit mobile version