Site icon Swatantra Tv

నాలుగేళ్ల తర్వాత… పుజారా సెంచరీ

ఛతేశ్వర్ పుజారా అంటే ఇండియన్ క్రికెట్ లో తెలియని వారుండరు. టెస్ట్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించుకుని రాహుల్ ద్రవిడ్ వారసుడిలా వాల్ పేరు సార్థకత చేసుకుంటూ ముందుకెళ్లిన పుజారా టెస్ట్ క్రికెట్ లో ఒక సెంచరీ లేక నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాడంటే విచిత్రమే.

తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ లో అతిరథ మహారథులైన ముగ్గురు బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టినప్పటికి, మొక్కవోని ధైర్యంతో నిలబడి 90 పరుగులు చేసి సెంచరీకి దగ్గరలో అవుటై నిరాశగా పెవెలియన్ బాట పట్టాడు.

అయితేనేం, సెకండ్ ఇన్సింగ్స్ లో ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. తన సహజశైలికి భిన్నంగా వన్ డే తరహాలో ఆడి130 బంతుల్లో 102 పరుగులు చేసి నాలుగేళ్ల ఎదురుచూపులకు తెర దించాడు. తన కెరీర్ లో 19వ సెంచరీ నమోదు చేశాడు.

ఒక దశలో జట్టులో స్థానం కోల్పోయిన పుజారా కౌంటీ క్రికెట్ కు నిలయమైన యూకేకి వెళ్లాడు. అక్కడ సర్రే జట్టు తరఫున ఆడి వరుస మ్యాచ్ లలో సెంచరీలు కొట్టాడు. ఇవన్నీ టెస్ట్ మ్యాచ్ ల్లో కాదు… 50 ఓవర్ల మ్యాచ్ ల్లో చేసి, వన్డేలకు తనేమాత్రం తీసిపోనని నిరూపించాడు. ఇప్పుడు చేసిన సెకండ్ ఇన్సింగ్స్ సెంచరీ కూడా అంతే స్పీడుగా చేయడం విశేషం.

ఎట్టకేలకు బంగ్లా జట్టుకి ఎంపికైన పుజారా రెండు ఇన్నింగ్స్ ల్లో  బ్రహ్మాండంగా ఆడి ఔరా అనిపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో పుజారా ఆ స్టాండ్ ఇవ్వకపోతే బంగ్లా మనమీద పై చేయి సాధించేదే. ప్రత్యర్థులకి ఆ అవకాశం ఇవ్వకుండా మిగిలిన వారితో కలిసి బలమైన పరుగుల కోట కట్టాడు. రాబోయే రోజుల్లో పుజారా నుంచి మరిన్ని సెంచరీలు రావాలని, అతను మరింత ధృడంగా ఆడాలని కోరుకుందాం.

Exit mobile version