Site icon Swatantra Tv

కామారెడ్డిలో ప్రోటోకాల్ రగడ!

      ఒకరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మరొకరు అధికారపార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు.. ఇద్దరూ హేమా హేమీలే.. వీరిద్దరిలో ఎవరికి పెద్దపీట వేయాలి.. ప్రొటోకాల్ ఎలా పాటించాలన్నది కామారెడ్డిలోని అధికారులకు పెద్దసమస్యగా మారింది. ఈ ఇద్దరి తో కక్కలేక మింగలేక  ఉన్నచందంగా తయారయింది అధికారుల పరిస్థితి.

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 4.53 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన 100 పడకల గదులు, వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ సమస్యగా తయారయింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే స్థానిక బిజెపి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అనంతరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించా రు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారు అని కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని ప్రశ్నించారు. కలెక్టర్ ను జీవోలను చదివి వినిపించాలని కోరారు.

ప్రోటోకాల్ వివాదం వస్తుందని ఊహించిన అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారని, అనుకోని కారణాలవల్ల అది కూడా రద్దయిందని వారు వివరణ ఇచ్చారు. ఆగ్రహించిన బిజెపి ఎమ్మెల్యే రమణారెడ్డి తన నిరసన వ్యక్తంచేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ప్రోటోకాల్ తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించను ఎవరు లంచం తీసుకున్న ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వయంగా రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పి వెళ్ళిపోయారు.

        ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. షబ్బీర్ అలీతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారందరినీ ఆస్పత్రి గేటు వద్దే అడ్డుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులకు మాత్రమే ఆసుపత్రి లోపలికి అనుమతించారు. ఆస్పత్రి పైభాగంలో 4.53 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ జితిష్వి పాటిల్ తో కలిసిప్రారంభించారు.

      ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేకపోయారని షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా ఆస్పత్రి 30 పడకలుగా ఉన్నప్పుడు తన హయాంలో పడకలను పెంచామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పనిచేసే ఆసుపత్రికి మంచి పేరు తేవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రాణహిత – చేవెళ్ల పనులు పూర్తి చేసేందుకు 200 కోట్లరూపాయల నిధులు అవసరం అన్నారు. ఆ మొత్తాన్ని కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మెడికల్ ఆసుపత్రి దోమకొండ 100 పడకల ఆసుపత్రి లో నిర్మాణం పూర్తి కాగానే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తీసుకువస్తానని పేర్కొన్నారు. ప్రొటోకాల్ గొడవతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వంద పడకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

Exit mobile version