బ్యాటరీల్లో వాడే అరుదైన ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు తనని కలిసిన ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయ బృందానికి భట్టి భరోసా ఇచ్చారు. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు మూర్తి నర్సింహ, ఆశోక్ కామరాజ్, మోనాష్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎలిశెట్టి మోహన్ ఉపముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బ్యాటరీల్లో ఉపయోగించే అరుదైన ఖనిజాలను ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని సొంతంగా తయారు చేసుకుంటే దేశానికి లాభమని మంత్రికి వివరించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్’ను తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు.