ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జర్నీ అంటేనే హడలిపోతున్నారు ప్రయాణికులు. నియమ నిబంధనలు గాలికొదిలేసి అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిందేనని బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతూ ప్రయాణికుల ముసుగులో మొక్కుబడిగా ప్యాసింజర్ పర్మిట్లతో కండిషన్ లేని బస్సులను నడుపుతున్నారని, దీంతో ప్రమాదం తప్పదని భయాందోళనకు గురవుతున్నారు. చేతికి ముడుపులు అందడంతో అధికారులు చూసి చూడనట్టు వ్యవహిరిస్తున్నారని మండిపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడ్డగోలుగా సాగుతున్న ట్రావెల్స్ దందాపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ దందా మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ప్రయాణికుల ముసుగులో మొక్కుబడిగా ప్యాసింజర్ పర్మిట్లు తీసుకొని, కండిషన్ లేని టూరిస్టు బస్సులను నడుపుతున్నారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్‌కు ప్రతిరోజు 15 నుంచి 18 ప్రైవేట్ బస్సులు నడుపుతుంటే అదే జాతీయ రహదారి గుండా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాయపూర్, నాగపూర్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ నుంచి వందలాది ప్రైవేట్ బస్సులు అనునిత్యం అక్రమ ప్యాసింజర్ రవాణా వ్యాపారం సాగుతోంది. దీంతో టాస్క్‌ఫోర్స్, పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిట్‌నెస్‌లేని బస్సులు బోల్తాపడటంతో ప్రయాణికులపాలిట మృత్యుశకటంగా మారుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక కారణమైతే పరిమితికి మించి బస్సులను ప్రయాణం సాగించ డం ప్రమాదానికి మరొక కారణంగా తెలుస్తోంది. ఇలాంటి కారణాల వల్లే ఇటీవల ముస్కాన్ ట్రావెల్స్ బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 22 మంది గాయాలపాలయ్యారు. అదే విధంగా కామారెడ్డి సమీపంలో డైమండ్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో ఓ ప్యాసింజర్ మరణించగా పలువురికి గాయాల య్యాయి. ఈ ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
జిల్లా కేంద్రం నుండి ప్రతిరోజు హైదరాబాద్‌కు ముస్కాన్, సహారా, మెట్రో గెలాక్సీ , ఎంబికే, డైమండ్ ట్రావెల్స్ తో పాటు ఆరెంజ్, జీడీఆర్ ఇలా అనేక రకాల ప్రైవేట్ బస్సులు ప్యాసింజర్స్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ అడ్డాగా ట్రావెల్స్ సామ్రాజ్యాన్ని నడుపుతోంది ముస్కాన్. ప్యాసింజర్ పేరిట భారీ ఎత్తున జీఎస్టీ టాక్స్ లేని, ప్రభుత్వ అనుమతి లేని రవాణా పెద్ద మొత్తంలో సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ రవాణాతో ట్రావెల్స్ వ్యాపారులు కోట్లల్లో సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో హైదరాబాద్ ట్రిప్ కోసం ప్రతీ సీటుకు ప్రతి నెలా ప్రభుత్వానికి పర్మిట్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బస్సుకు 42 మంది ప్రయాణికుల పరిమితి ఉండగా 50 మందికి పైగా టికెట్లు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నారు. మరోవైపు ప్యాసింజర్స్ స్పెషల్ పర్మిట్ కోసం మరికొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది కానీ అందుకు మనసొప్పక కొంత మేర మమ అన్నట్టు చెల్లించి, సర్కార్ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నారు. పర్మిట్ పేరిట ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము మొత్తం చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు. మరికొందరైతే కేవలం ఒక్క బస్సుకు పర్మిట్ తీసుకుని అక్రమంగా మూడు, నాలుగు బస్సులను నడిపిస్తూ అధికారుల కళ్లు కప్పుతున్నారు.
నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్ దగ్గర జరిగిన ముస్కాన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనతో ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుభవం లేని, హెవీ లైసెన్సు లేని తాత్కాలిక డ్రైవర్లను నియమించడం అతివేగం, అజాగ్రత్తలతో బస్సు నడపడం వల్లే ప్రమాదానికి కారణమైనట్టు గుర్తించారు. ఈ బస్సు నెంబర్ ప్లేట్‌పై టూరిస్ట్ సర్వీసుగా ముద్రించి ఉండటంతో ప్యాసింజర్ పర్మిట్ పేరుతో టూరిస్ట్ బస్సులను అక్రమంగా నడుపుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా కొన్ని బస్సులలో వెనక డిక్కీ పై భాగంలో లక్షల్లో విలువైన జీఎస్టీ టాక్స్ చెల్లించని వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇది చాలదన్నట్టుగా ప్యాసింజర్‌ల నుండి అడ్డు అదుపు లేకుండా టికెట్ చార్జీలు భారీగా వసూలు చేస్తు న్నారు. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాలటమాడే ట్రావెల్స్ అక్రమ దందాపై అధికారులు కొరడా ఝుళిపించాలని కోరతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు. ఇలాంటి విషయాల్లో అధికారుల నిర్లక్ష్యం తగదని, ఇకనైనా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.