Site icon Swatantra Tv

అంగరంగా వైభవంగా మొదలైన పూరి జగన్నాథుడి రథయాత్ర

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం హోరెత్తుతోంది. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నట్టు శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య పరిపాలనా అధికారి రంజన్ కుమార్ దాస్ తెలిపారు. ఈ ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున 80 ప్లాటూన్ల బలగాలను మోహరించారు. ఒక్కో ప్లాటూన్ లో 30 మంది పోలీసులు ఉంటారు. సాగరతీరం కావడంతో తీరంలో కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ సైతం గస్తీ నిర్వహిస్తోంది. పూరీ రథయాత్ర నేపథ్యంలో 125 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. పూరీ రథయాత్ర ప్రారంభానికి ముందు ఢిల్లీలోని హౌజ్ కాస్ లో ఉన్న జగన్నాథ్ మందిరం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు నిర్వహించారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఈ పవిత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జగన్నాథ స్వామి మన జీవితాలను ఆరోగ్యం, సంతోషం, ఆధ్యాత్మిక భావనలతో నిండుగా ఉంచాలని కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Exit mobile version