Site icon Swatantra Tv

సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు

ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారా లు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు 40మందిని పోలీసులు ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ టవర్స్‌ డేటా ఆధారం గా దర్యాప్తు చేపడుతున్నారు. సిట్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన 6ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దాడి జరిగిన స్పాట్‌లో 20వేల సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సీఎం జగన్‌, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుపై అజిత్‌సింగ్‌నగర్‌లో రాయి దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెలంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్‌ 197తో ఐపీసీ 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీపీ కాంతిరాణా ఏసీపీ నేతృత్వంలో మొత్తం 20మందితో ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు. నార్త్‌ జోన్‌ ఏసీపీ దేవరకొండ ప్రసాద్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. దాడికి సంబంధించి అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు.. జగన్‌ యాత్రను వీడియో తీశారు. వాటిలో రాయివచ్చి సీఎంకు తగలగానే నుదుటిపై చేయి పెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని సేకరించిన అధికారులు సైబర్‌ క్రైం విభాగంలోని ల్యాబ్‌లో విశ్లేషిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెల్‌టవర్‌ ఆధారంగా కాల్‌ డేటా రికార్డ్‌ జాబితాను వడబోస్తున్నారు. ఘటన సరిగ్గా మాకినేని బసవపున్నయ్య స్టేడియంను ఆనుకుని ఉన్న వివేకానంద స్కూల్‌ వద్ద జరిగింది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించాలని భావించారు. అయితే, సీఎం యాత్ర భద్రత రీత్యా విద్యుత్‌ శాఖ అధికారులు సరఫరాను నిలుపుదల చేశారు. స్కూల్‌కు చుట్టుపక్కల ఉన్న భవనాలకు సీసీ కెమెరాలు ఉన్నా.. విద్యుత్‌ లేకపోవడంతో ఫుటేజీ సేకరణ ఇబ్బందికరంగా మారింది. దీంతో డ్రోన్‌ కెమెరాల విజువల్స్‌ను విశ్లేషిస్తున్నారు.

Exit mobile version