Site icon Swatantra Tv

రచయిత్రి అరుంధతీ రాయ్‌కి పెన్‌ పింటర్‌ ప్రైజ్‌

   భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్‌ 2024 సంవత్సరం పెన్‌ పింటర్‌ ప్రైజ్‌ను అందుకోనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న అరుంధతీ రాయ్‌కి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇంగ్లిష్‌ పెన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా, నోబెల్‌ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్‌ పింటర్‌ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. తనకు పురస్కారం రావడంపట్ల రాయ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం తీసుకుంటున్న అపారమైన మలుపులపై రచనలు చేయడానికి హరోల్డ్‌ పింటర్‌ మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులకు చలించని తీరు, ప్రపంచం పట్ల నిర్మొహమాటమైన దృక్పథం, సామాజిక వాస్తవాలకు అక్షర రూపం ఇచ్చిన యూకే, కామ న్వెల్త్ గేమ్స్ దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇంగ్లీష్ పెన్ చైర్మెన్ రూథ్ బోర్త్‌విక్‌, న‌టుడు ఖ‌లిద్ అబ్ద‌ల్లా, రైట‌ర్ రోజ‌ర్ రాబిన్‌స‌న్‌ల‌తో కూడిన జ్యూరీ అరుంధ‌తీ రాయ్‌ని అవార్డు కోసం ఎంపిక చేసింది. గ‌తంలో ఈ అవార్డు గెలుచుకున్న వారిలో మైఖేల్ రోసెన్, మార్గ‌రేట్ అట్‌ వుడ్‌, మ‌లోరి బ్లాక్‌మాన్‌, స‌ల్మాన్ ర‌ష్దీ, టామ్ స్టాపార్డ్‌, కార‌ల్ ఆన్ డ‌ఫీ ఉన్నారు.

Exit mobile version