Site icon Swatantra Tv

ప్రముఖులను భయపెడుతున్న పెలికాఫ్టర్ జర్నీ

హెలికాప్టర్‌ జర్నీ ప్రముఖులను భయపెడుతోంది. వాయు ప్రయాణం చేయాలంటే గజగజ వణికిపోవాల్సి వస్తోంది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డెడ్‌బాడీ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితిలో ఎందరో మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, సినీ స్టార్లు ఇలా అనేకులు హెలికాప్టర్‌ ప్రమాదబారినపడి మరణించారు. తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా అలాగే దుర్మరణం పాలయ్యారు. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి..? హెలికాప్టర్‌ జర్నీలో మరణించిన ఆ ప్రముఖులెవరో ఓసారి తెలుసుకుందాం.

అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయనతోపాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో తయారైన బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. హెలికాప్టర్ పర్వత శిఖరాన్ని ఢీకొట్టినట్లు అక్కడి చిత్రాలు చూపించాయి. వాతావరణం అనుకూలంగాలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ప్రమాదం గురించిన తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి రెస్య్కూ బృందాలు. శిథిలాలను చేరుకోవడానికి వారు రాత్రంతా శ్రమించారు. వాతావరణం సరిగా లేకపోవడం, మంచు తుఫాను కారణంగా ప్రమాద స్థలాన్ని కనుగొన్నా, వెంటనే అక్కడికి చేరుకోలేక పోయారు. ప్రయాణీకులలో ఎవరూ బతికినట్లు ఆనవాళ్లు కన్పించలేదని ఇరాన్ నాయకుడు పిర్హోస్సేన్ కొలివాండ్ తెలిపారు. 2021లో ప్రెసిడెంట్ గా ఎన్నికైన 63 ఏళ్ల ఇబ్రహిం రైసీ దేశంలో కఠినమైన నైతిక చట్టాలను అమలు చేశారు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హింసాత్మకంగా అణిచివేశారు. తన పదవీకాలంలో ప్రపంచ దేశాలతో అణు శక్తికి సంబంధించిన చర్చలను ప్రోత్సహించారు.

ఇలాంటి మరణాలు కొత్తేమీ కాదు. 1980 జూన్‌ 23న దిల్లీలో సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణించారు. కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడాయన. ఇక జాతీయ స్థాయిలో మంచి గుర్తిపు ఉన్న నేత.. కాంగ్రెస్‌ సీనియర్‌, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా విమాన ప్రయాదంలోనే దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింథియా సహా ఏడుగురు మరణించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సైతం ఈ హెలీకాఫ్టర్ ప్రమాదాలు చాలాసార్లు భయపెట్టాయి. ఎన్నో విషాదాలను నింపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 430 హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం ఐదుగురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర్ రెడ్డి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే మిగిలింది.

అంతకు ముందు కూడా ఉమ్మడి ఏపీకి చెందిన ఓ కీలక నేత హెలికాప్టర్‌ ప్రమాదంలోనే దుర్మరణం పొందారు. అప్పటి లోక్‌సభ స్పీకర్‌, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 206 హెలికాప్టర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. ఆయన మరణం టీడీపీకి తీరని లోటుగా మారింది. ఇలా పొలిటికల్‌ లీడర్లనే కాదు.. సినీ స్టార్లను పొట్టనబెట్టుకున్నాయి హెలికాప్టర్‌ ప్రమాదాలు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సౌందర్య కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్‌ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు. ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షక లోకం మరిచిపోదు.ఇక అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ధోర్జీ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో 2011 ఏప్రిల్‌ 30న మృత్యు ఒడికి చేరారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ బీ8 మోడల్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు మరణించారు. దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ కూడా హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. బిపిన్ రావత్ భారత్‌కు తొలి త్రివిధ దళాలకు అధిపతిగా చరిత్రలోకి ఎక్కారు. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ భార్య సహా 13 మంది మృతి చెందారు. ఇలా ఎందరో ప్రముఖులు హెలికాప్టర్‌ ప్రమాద బారినపడి మృత్యు ఒడికి చేరారు.

Exit mobile version