Site icon Swatantra Tv

పల్లె బాట పట్టిన పట్నం.. ప్రైవేటు ట్రావెల్స్ నిలువుదోపిడీ

పల్లె పిలుస్తోంది. సంక్రాంతికి రమ్మంటోంది. దీంతో పట్నం పల్లె బాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు శని, ఆదివారం కావడంతో లక్షల మంది జనం క్యూ కట్టారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో జాతీయ రహదారిపై క్యూ కట్టాయి. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులతో పాటు నేషనల్‌ హైవేస్‌ అన్నీ కిటకిటలాడుతున్నాయి.

సంక్రాంతి పండుగను సొంతూళ్లో జరుపుకునేందుకు హైదరాబాద్‌ వాసులు పయనమయ్యారు. ఇక ప్రయాణికులతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ మొదలైంది. పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌గేట్ల దగ్గర ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌- విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్‌ కనిపిస్తోంది. వేలాది వాహనాలు ఒక్కసారిగా కదలడంతో ట్రాఫిక్‌ మెల్లగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదార్లపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్‌ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్‌ అవుతున్నాయి. వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది.

ఇక రహదారులే కాదు నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్‌ లు రద్దీగా మారాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. మరోవైపు సంక్రాంతి రష్‌ను క్యాష్‌ చేసుకుంటున్నాయి ప్రైవేటు ట్రావెల్స్‌. డబుల్‌, ట్రిపులు ఛార్జ్‌చేస్తున్నారు.

వెయ్యి రూపాయలు ఉండే టికెట్‌ ధరను రెండు వేలు, మూడు వేలు ఛార్జ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లాలంటే టికెట్ ధర రూ. వెయ్యి లోపే ఉంటుంది. కానీ రూ. 1500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.2000ల లోపే ఉంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రూ.3వేల నుంచి రూ.5500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక స్లీపర్‌ అయితే రూ.6వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.

Exit mobile version